చైనా మాంజానా.. మజాకా!
దేశ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన పతంగులు ఎగరేయడానికి ఉపయోగించిన 'చైనా మాంజా' కారణంగా ఢిల్లీలో ముగ్గురు మరణించడంతో ఆ మర్నాడే ఢిల్లీ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. గత రెండేళ్లలోనే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో ఈ మాంజా కారణంగా 15 మందితో పాటు వందలాది పక్షులు మరణించాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు చైనా మాంజాపై నిషేధం విధించాయి. ఇప్పుడు డిల్లీ ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది.
1986 నాటి పర్యావరణ పరిరక్షిణ చట్టం కింద వివిధ రాష్ట్రాలు గుడ్డిగా చైనా మాంజాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశాయని చెప్పవచ్చు. ఎందుకంటే చైనా మాంజా అంటే ఏమిటీ, దాన్ని నిజంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారా? దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు, మాంజా తయారీకి పాటించాల్సిన ప్రమాణాలు ఏమిటీ? ఎలాంటి మాంజాలను నిషేధించాలి? నిషేధాన్ని ఎలా అమలు చేయాలన్న అంశాల జోలికి వెళ్లకుండానే పలు రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్డిగా నిషేధ ఉత్తర్వులు జారీ చేశాయి. దాంతో నిషేధిత రాష్ట్రంలో కూడా ఇప్పటికీ చైనా మాంజా మార్కెట్‌లో లభిస్తోంది.
'చైనా మాంజా అనగానే సాధారణంగా అందరూ చైనా నుంచి దిగుమతి చేసుకున్న మాంజా అని పొరపాటు పడతారు. ప్రభుత్వాలు కూడా అదే భావంతో ఉన్నట్లు ఉన్నాయి. వాస్తవానికి చైనా, తైవాన్‌ల నుంచి దిగుమతి చేసుకొనే గ్లాస్ కోటెడ్ పాలిమర్ లేదా పోలిప్రోపిలిన్ ఉపయోగించి స్థానికంగానే ఈ మాంజాను ఉత్పత్తి చేస్తున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్నదని అనుకోవాలనే ఉద్దేశంతోనే దానికి ఆ పేరు పెట్టారు. ఇది ఒట్టి మార్కెటింగ్ జిమ్మిక్కు మాత్రమే' అని బెంగుళూరుకు చెందిన మాంజా ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి, అమ్మకాల విభాగం అధిపతి మోహిత్ కార్తికేయన్ మీడియాకు తెలిపారు.
బెంగళూరుతోపాటు సోనెపట్, నోయిడాల్లో ఈ మాంజాను ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారని పాత ఢిల్లీకి చెందిన చేతి పతంగి ఉత్పత్తిదారుల సంఘం ఉపాధ్యక్షడు సచిత్ గుప్తా తెలిపారు. కాటన్ దారం మాంజా కన్నా పదునెక్కువగా ఉండటమే కాకుండా తక్కువ ధరకు కూడా దొరుకుతుండటంతో చైనా మాంజాకు డిమాండ్ పెరిగిందని ఆయన చెప్పారు. ఈ మాంజా కోసం చైనా నుంచి కనీసం దారం కూడా దిగుమతి చేసుకోరని, దిగుమతి చేసుకున్న సింథటిక్ పాలిమర్‌తో దీన్ని స్థానికంగానే తయారు చేస్తున్నారని ఆయన వివరించారు. చైనా మాంజాపై నిషేధం విధించిన ప్రభుత్వాలు మాంజాల ఉత్పత్తికి పాటించాల్సిన ప్రమాణాలను సూచించాలని, అంతవరకు నిషేధం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, చైనా మాంజానే మళ్లీ పేరు మార్చుకొని మార్కెట్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని కార్తికేయన్ చెప్పారు. మనుషుల మరణాల విషయానికొస్తే కాటన్ మాంజాల వల్ల కూడా ప్రమాదం ఉంటుందని ఆయన అన్నారు.
గుజరాత్ ప్రభుత్వం 2009 నవంబర్‌లో, మహారాష్ట్ర 2015లో, ఆంధ్రప్రదేశ్ 2016 మేనెలలో, కర్ణాటక ప్రభుత్వం 2016 జూలై నెలలో చైనా మాంజాపై నిషేధం విధించగా, ఇప్పుడు వాటి సరసన ఢిల్లీ ప్రభుత్వం చేరింది.