భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా జిత్తులు | China Says India Could Face Military Pressure From China Pakistan And Nepal | Sakshi
Sakshi News home page

భారత్‌ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహం

Published Thu, Jun 18 2020 9:17 AM | Last Updated on Thu, Jun 18 2020 12:17 PM

China Says India Could Face Military Pressure From China Pakistan And Nepal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్‌ సరికొత్త ఎత్తుగడలకు కుట్రపన్నుతోంది. భారత్‌ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే భారత్‌తో సరిహద్దు వివాదాలు నెలకొన్న పాకిస్తాన్‌, నేపాల్‌ను రంగంలోకి దించాలని భావిస్తోంది. లద్దాఖ్‌ రీజియన్‌లోని వివాదాస్పద అక్సాయ్‌ చిన్‌ ప్రాంతంలో భారత్, చైనా మధ్య ఘర్షణలో 20 మంది భారత సైనికులు అసువులు బాయగా, కొందరు చైనా సైనికులు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు చైనా హెచ్చరికలు పంపింది. చైనా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పతిక్రను వేదికగా చేసుకుని గురువారం ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్‌ తమపై దాడికి దిగితే అదే సమయంలో పాకిస్తాన్‌, నేపాల్‌ నుంచి ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. చైనాతో యుద్ధమంటే పాకిస్తాన్‌, నేపాల్‌ నుంచి కూడా మిలటరీని ఎదుర్కొక తప్పదంది. (సరిహద్దు ఘర్షణలో సరికొత్త సవాళ్లు)

ఆ‍యా దేశాలతో ఇప్పటికే సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరినా తమ మిత్ర దేశాలతో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని భారత్‌ తమపైకి దాడి చేసే సాహాసం చేయదని పేర్కొంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య నెలకొన్న వివాదాన్ని డ్రాగన్‌ మరోసారి తెరపైకి తెచ్చింది. అలాగే పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు, కశ్మీరీల హక్కులు, పాక్‌తో సరిహద్దు వివాదాలను సైతం చైనా గుర్తు చేసింది. మూడు వైపుల నుంచి భారత్‌పై దాడికి పాల్పడే అవకాశం తమకుంటుందని జిత్తులమారి చైనా చెప్పకనే చెప్పింది. ఇప్పటికే నేపాల్‌ను భారత్‌పైకి ఉసిగొల్పిన విషయం తెలిసిందే. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను నేపాల్‌ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్‌ ఆమోదం తెలిపి భారత సహనాన్ని పరీక్షిస్తోంది. (జవాన్ల మధ్య ఘర్షణకి కారణం ఏంటంటే..)

ఈ క్రమంలోనే భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదం తీవ్ర రూపం దాల్చడంలో వీటన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు డ్రాగన్‌ కుట్రలు పన్నుతోంది. ఈ మేరకు పాకిస్తాన్‌, నేపాల్‌ దేశాలతో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. కాగా పాకిస్తాన్‌, నేపాల్ ఎప్పటి నుంచో చైనా అనుకూల దేశాల దేశాలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్‌ విషయంలో చైనాను ఒంటరిపక్షి చేయాలన్న అమెరికా పిలుపునకు ప్రపంచ దేశాలన్ని సానుకూలంగా స్పందించాయి.

ఆస్ట్రేలియా పిలుపు మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సైతం భారత్‌ మద్దతు ప్రకటించింది. ఈ పరిణామం చైనాకు కంటగింపుగా మారింది. భారత్‌ను ఎలానైనా దెబ్బతీయాలని సరిహద్దుల్లో గిల్లికజ్జాలుకు దిగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం భారత సైనికులపైకి దాడికి దిగి ఏకండా 20 మంది జవాన్లను పొట్టనబెట్టుకుంది. 1964 తరువాత తొలిసారి ఇరుదేశాల సరిహద్దుల నడుమ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement