
సైనిక చర్య తప్పదు: చైనా
బీజింగ్: సిక్కిం రాష్ట్ర సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులపై వెనక్కు తగ్గకపోతే.. భారత్ సైనిక చర్యను ఎదుర్కొవాల్సివుంటుందని చైనా అధికారిక పత్రిక హెచ్చరించింది. భారత్-చైనాల మధ్య చెలరేగిన సమస్య చిలికి చిలికి గాలివానగా మారి యుద్ధానికి దారితీస్తుందని పేర్కొంది. గత చరిత్ర నేర్పిన పాఠాలను పునరుద్ఘాటిస్తూ సాధ్యమైనంతవరకూ శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది.
భారత్ మాట వినకపోతే.. సైనిక చర్య తప్పదని పేర్కొంది. అమెరికా దగ్గర గప్పాలు కొట్టేందుకే భారత్, చైనాను రెచ్చగొడుతోందని వ్యాఖ్యానించింది. చైనా కంటే భారత్ ఏమంత గొప్ప శక్తిమంతమైన దేశం కాదని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో రీసెర్చ్ స్కాలర్‌గా పని చేస్తున్న హు జియాంగ్ అనే వ్యక్తి వ్యాఖ్యానించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ విషయం తెలుసని అందుకే ఆయన ఇరు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించారని పేర్కొన్నారు.
భారత్, చైనాను తన విరోధిగా భావిస్తున్నా.. చైనా మాత్రం అదేం పట్టించుకోకుండా ముందుకు సాగిపోతోందని అన్నారు. భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని హు అన్నట్లు గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఏం మాట్లాడకుండా ఉండటం ఇండియాకే మంచిదని హు సలహా ఇచ్చినట్లు వివరించింది.