సాక్షి, అజ్మీర్ : రాజస్థాన్ పాఠ్యపుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సరికొత్త భాష్యం చెబుతున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, లోకమాన్య తిలక్‌గా పేరొందిన బాల గంగాధర్ తిలక్‌ను ఉగ్రవాద పితామహుడుగా పాఠ్యపుస్తకాల్లో అభివర్ణించడం పెనుదుమారం రేపింది. ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రం రిఫరెన్స్ బుక్ 22వ చాప్టర్‌లో 18, 19వ శతాబ్ధాల్లో జాతీయ ఉద్యమం పేరిట ఓ ఉప అంశంగా తిలక్‌ను ప్రస్తావించారు. పుస్తకంలోని 267వ పేజీలో ‘ తిలక్ జాతీయ ఉద్యమానికి దిక్సూచీగా నిలిచినందున ఆయనను ఉగ్రవాద పితామహుడిగా’ పిలుస్తారని పొందుపరిచారు.
రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఆర్‌బీఎస్‌ఈ) అనుబంధం ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌కు పుస్తకాలు సరఫరా చేసే మధురకు చెందిన ప్రింటర్ ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఈ చాప్టర్ అంతా తప్పులతడకగా ఉండటంతో వివాదాస్పదమైంది. తిలక్‌ను ఉగ్రవాద పితామహుడుగా పేర్కొనడం గర్హనీయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ కైలాష్ శర్మ అన్నారు.
పాఠ్య పుస్తక సారాంశాల్లో మార్పులు చేసే ముందు చరిత్రకారులను సంప్రదించాలని సూచించారు. స్వాతంత్య సమరయోధుడు తిలక్‌ను ఉగ్రవాద పితామహుడిగా పేర్కొనడం పట్ల కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే దీన్ని సవరించి, బాధ్యులపై చర్యలు చేపట్టాలని రాజస్ధాన్ సీఎంను ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment