
సాక్షి, చెన్నై : తూత్తుకుడిలో స్టెరిలైట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన నిరసనకారులపై జరిగిన కాల్పుల ఘటనపై తమిళనాడు సీఎం పళనిస్వామి స్పందించారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్ధలు సహా సంఘ విద్రోహ శక్తులు స్ధానికులను తప్పుదోవ పట్టించడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు. తూత్తుకుడిలో రాగి విద్యుత్ గ్రాహక ప్లాంట్ ఏర్పాటుకు నిరసనగా ఆందోళన చేపట్టిన స్ధానికులపై పోలీసులు అత్యంత పాశవికంగా అసాల్ట్ రైఫిల్స్‌తో కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే.
గత మూడు నెలలుగా ప్లాంట్ కారణంగా ఈ ప్రాంతం కాలుష్యమయమవుతుందని స్ధానికులు నిరసన తెలుపుతున్నారు. తూత్తుకుడి కాల్పులకు కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్‌జీవోలు, సంఘవ్యతిరేక శక్తులు ప్రజలను తప్పుదారి పట్టించడమే కారణమని పళనిస్వామి ఆరోపించారు. ప్రజలు తిరగబడి దాడులు చేయడం వల్లే వారిని ఎదుర్కొని ఆత్మరక్షణ కోసం పోలీసులు చర్యలు చేపట్టాల్సి వచ్చిందని పోలీసులను వెనకేసుకొచ్చారు.
పోలీసులు నిరసనకారులపై నేరుగా కాల్పులు ఎలా జరుపుతారన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. కాగా తూత్తుకుడి ఘర్షణల్లో 11 మంది మరణించగా, 67 మందికి గాయాలయ్యాయి. హింసకు పాల్పడ్డారంటూ పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.