Tamilanadu CM
-
సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?
ఆయన అసలు పేరు సుమన్ తల్వార్. మద్రాసులో పుట్టిపెరిగిన ఈ సీనియర్ నటుడు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి మెప్పించాడు. ఒకప్పట్లో బహుభాషా హీరోగా ఒక వెలుగు వెలిగాడు. కరాటే మార్షల్ ఆర్ట్స్‌లో తనకు టాలెంట్ ఉండటంతో యాక్షన్ సినిమాలకు అప్పట్లో మారుపేరుగా నిలిచాడు. అలా అన్ని భాషల్లో కలిపి దాదాపు 700 చిత్రాలు చేసినా.. తెలుగు సినిమాలోనే సెటిలయ్యాడు. సుమన్ డేట్స్ కోసం ఆ రోజుల్లో దర్శకనిర్మాతలు క్యూకట్టేవారు. చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కూడా సుమన్ పోటీ పడేవాడు. అయితే నీలి చిత్రాలను సుమన్ తీసినట్లు వచ్చిన ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆపై జైలు జీవితం కూడా గడిపాడు. (ఇదీ చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?) ఆ కారణం వల్ల ఒక్కసారిగా ఆయన ఇమేజ్ దెబ్బతిన్నది. సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. దీని వెనుక చాలా మంది హీరోలతో పాటు పరిశ్రమకు చెందిన పలువురు కలిసి పక్కా ప్లాన్‌తో ఆయన్ను ఇరికించారనే ఆరోపణలు వచ్చాయి అవి ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పేరును కూడా పలువురు ప్రచారం చేశారు. కానీ అందులో నిజం లేదని సుమన్ బహిరంగంగానే పలుమార్లు చెప్పాడు. అసలు విషయం ఏంటనేది ఇప్పటికీ ఆయన చెప్పలేదు. కానీ సుమన్ జైలుకు సంబంధించిన టాపిక్‌పై దివంగత సీనియర్ దర్శకులు సాగర్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో అమ్మదొంగా ‘స్టూవర్ట్‌పురం దొంగలు, ఓసినా మరదలా, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెంబర్ 1 సహా సుమారు 40 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలా ఆయన అందరికి సుపరిచయమే. ఈ కారణంతోనే జైలుకు వెళ్లాడు నీలి చిత్రాల విషయంలో సుమన్ జైలుకు వెళ్లలేదని ఆ వీడియోలో డైరెక్టర్ సాగర్ తెలిపారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్, అప్పట్లో తమిళనాడులో పనిచేస్తున్న డీజీపీ, ఒక లిక్కర్ కాంట్రాక్టర్ (వడియార్) వీళ్ల ముగ్గురి వల్లే సుమన్ జైలుకు వెళ్లాడని ఆయన చెప్పారు. ఆ సమయంలో లిక్కర్ కాంట్రాక్టర్ చాలా పవర్ ఫుల్ అలాంటి వ్యక్తి కూతురిని సుమన్ ఫ్రెండ్ ఒకరు ప్రేమించాడు. మరోవైపు హీరో సుమన్ అంటే ఆ రాష్ట్ర డీజీపీ కూతురికి చాలా ఇష్టం. అతని సినిమా షూటింగ్ ఎక్కడుంటే ఆ అమ్మాయి కూడా అక్కడికి వచ్చేదని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ సుమన్ మాత్రం ఆ అమ్మాయిని ఇష్టపడే వాడు కాదని తెలిపాడు. ఒకరకంగా వన్‌సైడ్ లవ్ అని చెప్పాడు. కానీ డీజీపీ మాత్రం తన కూతురికి ఇప్పటికే పెళ్లి అయిందని, ఆమె సుమన్ ట్రాప్‌లో పడిందనే ఆలోచనతో ఎంజీఆర్‌కు తెలపడం. మరోవైపు సుమన్ ఫ్రెండ్ కూడా లిక్కర్ కాంట్రాక్టర్ కూతురితో ప్రేమ వ్యవహారం. ఈ రెండు విషయాలు సుమన్‌ను ఇబ్బంది పెట్టాయని సాగర్ తెలిపారు. సుమన్ అరెస్ట్ అవుతాడని ఆ నిర్మాతకు ముందే తెలుసు సుమన్ విషయంపై డైరెక్టర్ సాగర్ ఇలా చెప్పారు.. 'ఒకరోజు సుమన్‌ను ఎంజీఆర్ తన ఇంటికి పిలిచి పరోక్షంగా డీజీపీ కూతురికి దూరంగా ఉండాలని సూచించాడు. దీంతో సుమన్ కూడా చెప్పాల్సింది నాకు కాదు ఆ అమ్మాయికి అన్నాడు. అక్కడ ఎంజీఆర్‌కు కొంతమేరకు కోపం వచ్చింది. అలా ఒకరోజు అందరూ చూస్తుండగా నడిరోడ్డులో సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు సుమన్‌పై ఇలాంటి తప్పుడు కేసు పెట్టడంతో పాటు బెయిల్ రాకుండా ఉండే పలు సెక్షన్స్ నమోదు చేశారు. కానీ అప్పట్లో సుమన్‌పై చాలా పుకార్లు వచ్చాయి. అవన్నీ అబద్దాలే. (ఇదీ చదవండి: తమన్నా కోసం ఆ టాప్ హీరోయిన్ను టార్గెట్ చేసిన అజిత్) సుమన్ ఫ్రెండ్‌కు వీడియో క్యాసెట్ల షాప్ ఉండేది. అక్కడికి చాల మంది అమ్మాయిలు వచ్చేవారు కాబట్టి ఈజీగా ఇలాంటి కేసును సుమన్‌పై నమోదు చేశారు. ఇదే సమయంలో సుమన్ అరెస్ట్ కాబోతున్నాడని నిర్మాత దగ్గుబాటి రామానాయుడికి ముందే తెలుసు. ఆ సమయంలో సుమన్‌తో తీయాల్సిన సినిమా ఆపేశాడు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగినా ఆయన తిరిగి సమాధానం చెప్పలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. జైలు నుంచి ఎలా రిలీజ్ అయ్యాడంటే సుమన్ అమ్మగారికి అప్పటి గవర్నర్ PC అలెగ్జాండర్ క్లాస్మేట్ కావడంతో జరిగిన విషయాన్ని ఆయనకు చెప్పడంతో బెయిల్ లభించిందని ఆయన చెప్పాడు. అయినా కూడా సుమారు ఆరు నెలలు జైలు జీవితాన్ని సుమన్ గడిపాడని ఆయన తెలిపాడు. జైలుకు వెళ్తున్న సమయంలో సుమన్ వద్ద ఉన్న డబ్బు,పలు ఆస్తి కాగితాలను తన స్నేహితులకు ఇచ్చాడట. అతను రిలీజ్ అయి బయటకు వచ్చాక వారందరూ కూడా సుమన్‌ను మోసం చేసి డబ్బు ఎగ్గొట్టారని ఆయన తెలిపాడు. అప్పట్లో సుమన్ వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆ సమయంలో అతని మేనేజర్ సారథినే కొంత సాయం చేశారు. తర్వాత మళ్లీ పలు సినిమాలు తీసి జీవితంలో నిలదొక్కున్నాడని సుమన్ గురించి పలు ఆసక్తకరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాగర్ చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
స్టాలిన్‌కు షాక్.. పార్టీకి కీలక నేత గుడ్ బై
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు గట్టి షాక్ తగిలింది. అధికార డీఎంకే పార్టీలో కీలక నేత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంగళవారం లేఖ రాశారు కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సుబ్బలక్ష్మి జగదీశన్. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 1947లో ఎరోడ్ జిల్లాలో జన్మించిన సుబ్బలక్ష్మి జగదీశన్.. ద్రావిడ మున్నెట్ర కజగం(డీఎంకే) పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. తిరుచెంగోడ్ నియోజకవర్గం నుంచి 14వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా 2004-2009 వరకు బాధ్యతలు చేపట్టారు. అంకు ముందు 1977-1980, 1989-1991 వరకు తమిళనాడు ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగేది ఆ ఇద్దరే! సోనియా సపోర్ట్ ఎవరికంటే.. -
తూత్తుకుడి ఘటనకు వారే బాధ్యులు..
సాక్షి, చెన్నై : తూత్తుకుడిలో స్టెరిలైట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన నిరసనకారులపై జరిగిన కాల్పుల ఘటనపై తమిళనాడు సీఎం పళనిస్వామి స్పందించారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్ధలు సహా సంఘ విద్రోహ శక్తులు స్ధానికులను తప్పుదోవ పట్టించడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు. తూత్తుకుడిలో రాగి విద్యుత్ గ్రాహక ప్లాంట్ ఏర్పాటుకు నిరసనగా ఆందోళన చేపట్టిన స్ధానికులపై పోలీసులు అత్యంత పాశవికంగా అసాల్ట్ రైఫిల్స్‌తో కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా ప్లాంట్ కారణంగా ఈ ప్రాంతం కాలుష్యమయమవుతుందని స్ధానికులు నిరసన తెలుపుతున్నారు. తూత్తుకుడి కాల్పులకు కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోలు, సంఘవ్యతిరేక శక్తులు ప్రజలను తప్పుదారి పట్టించడమే కారణమని పళనిస్వామి ఆరోపించారు. ప్రజలు తిరగబడి దాడులు చేయడం వల్లే వారిని ఎదుర్కొని ఆత్మరక్షణ కోసం పోలీసులు చర్యలు చేపట్టాల్సి వచ్చిందని పోలీసులను వెనకేసుకొచ్చారు. పోలీసులు నిరసనకారులపై నేరుగా కాల్పులు ఎలా జరుపుతారన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. కాగా తూత్తుకుడి ఘర్షణల్లో 11 మంది మరణించగా, 67 మందికి గాయాలయ్యాయి. హింసకు పాల్పడ్డారంటూ పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
నెరవేరిన శశి‘కల’
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన రెండు నెలల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఇప్పటికే అన్నా డీఎంకే సారథ్య బాధ్యతలను స్వీకరించిన జయ ఆప్తురాలు వి.కె. శశికళ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికై ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి సిద్ధపడుతున్నారు. మంగళవారమే ఆమె పదవీ స్వీకార ప్రమాణం చేస్తారన్న వార్తలు తొలుత వెలువడ్డా తమిళనాడు బాధ్యతలను కూడా చూస్తున్న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగరరావు సోమవారం రాత్రి వరకూ అందుకు సంబంధించిన నిర్ణయమేదీ తీసుకోకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను ఆయన ఆమోదించారు గనుక సాధ్యమైనంత త్వరలోనే రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతారని భావించాలి. ఆ సంగతలా ఉంచి వారసత్వ రాజకీయాలకు అలవాటుపడిపోయిన దేశ ప్రజలకు తమిళనాట పరిణామాలు వింత అనిపించవచ్చు. కష్టకాలంలో సైతం జయకు శశికళ అత్యంత సన్నిహితంగా మెలిగిన సంగతి వాస్తవమే. అయితే ఆ సాన్నిహిత్యం ఆమెకు పార్టీతోపాటు ప్రభుత్వాన్ని కూడా దక్కేలా చేస్తుందని ఎవరూ అనుకుని ఉండరు. జీవించి ఉండగా తన బంధుగణంలోని వారెవరినీ జయలలిత తన దగ్గరకు రానీయలేదు. అదే సమయంలో శశికళకు కూడా పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఎలాంటి పదవులూ ఇవ్వలేదు. పార్టీకి సంబంధించిన ఏ వేదికలపైనా ఆమె మాట్లాడిన దాఖలాలు లేవు. ఆమె ద్వారా పార్టీ శ్రేణులకు జయ వర్తమానం పంపించిన వైనమూ లేదు. అయినప్పటికీ అనుక్షణమూ వెన్నంటి ఉండటంవల్ల జయ వారసురాలు శశికళేనన్న నిశ్చితాభిప్రాయానికి పార్టీ శ్రేణులు వచ్చి ఉండొచ్చు. అటు పన్నీరుసెల్వం కూడా జయలలితకు సన్నిహితుడే కాక నమ్మినబంటు. ఆమెకు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తిన రెండు సందర్భాల్లో సీఎం బాధ్యతలు స్వీకరించినా సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భంలో సైతం జయ ఆదేశాలకోసం ఎదురుచూశారు తప్ప చొరవ ప్రదర్శించలేదు. అంతేకాదు జయకు ఏర్పడిన చిక్కులు పరిష్కారమయ్యాక మళ్లీ ఆ పదవిని బహుజాగ్రత్తగా ఆమెకు అప్పగించడంలో పన్నీరుసెల్వం విధేయత తిరుగులేనిది. ఆ అర్హత కారణంగానే జయ అస్వస్థురాలైనప్పుడు కూడా ఆ బాధ్యతలను పన్నీరుసెల్వం చేతిలో పెట్టారు. జయ మరణానంతరం మరోసారి ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక పార్టీని శశికళ చూసుకుని ప్రభుత్వాన్ని పన్నీరుసెల్వానికే అప్పజెబుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అన్నిటిపైనా పట్టు సాధించుకున్నాకే ఆమె సీఎం పదవి చేపట్టువచ్చునని విశ్లేషణలొచ్చాయి. శశికళకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ గతానుభవం లేకపోవడమే వీటన్నిటికీ ప్రాతిపదిక. కొద్దిరోజుల్లోనే శశికళ తనేమిటో నిరూపించుకున్నారు. వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ చాలా త్వరగానే తాను అనుకున్నది సాధించుకోగలిగారు. బాహాటంగా కనబడకపోవచ్చుగానీ ఇదంతా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా జరిగిందనడానికి లేదు. పదవిని కాపాడుకోవడానికి పన్నీరుసెల్వం చేతనైన ప్రయత్నం చేశారు. ఆయనకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఆశీస్సులు ఉండటం రహస్యమేమీ కాదు. పన్నీరుసెల్వంను సీఎం పదవిలో కొనసాగించడం కోసం కేంద్రంలోని బీజేపీ పెద్దలు రాయబారాలు సాగించి శశికళకూ, ఆయనకూ మధ్య సామరస్యాన్ని కుదిర్చారని...అందువల్ల జయ మరణాన్ని ప్రకటించడం కాస్త ఆలస్యమైందని కథనాలు వెలువడ్డాయి. ఆమధ్య రాష్ట్రంలో జరిగిన సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు, ఇతర పరిణామాలు పన్నీరుసెల్వం స్థితిని పటిష్టపరచడంలో భాగమన్న ఊహాగానాలొచ్చాయి. కానీ స్వతస్సిద్ధమైన శక్తియుక్తులున్నప్పుడు మాత్రమే వెలుపలి సాయం అక్కరకొస్తుంది. అది లేనప్పుడు బయటివారు చేయగలిగేది ఏమీ ఉండదు. ప్రచారానికి దూరంగా ఉండటం... నిమిత్తమాత్రుడిగా వ్యవహరించడం... ముఖ్యమంత్రి పదవిని సైతం ఒక ఉద్యోగంలా భయభక్తులతో చేయడం పన్నీరుసెల్వానికి అలవాటు. సీఎం పదవిలో ఉన్నా తనకంటూ పార్టీలో వర్గాన్ని ఏర్పాటు చేసుకొనే ప్రయత్నం ఆయనెప్పుడూ చేయలేదు. జయలలిత ఉన్నప్పుడు వీటన్నిటినీ ఎవరైనా సానుభూతితో అర్ధం చేసుకుంటారు. కానీ ఆమె మరణించాక కూడా పన్నీరుసెల్వం ఆ బాణీనే కొనసాగించారు. ఇప్పుడు శశికళ ముఖ్యమంత్రి కావడంపై ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే, మరో పార్టీ కాంగ్రెస్‌లతోపాటు బీజేపీ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెరవెనక ఏం జరిగినా తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇప్పుడు అన్నా డీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా శశికళ ఎన్నిక కావడంలో చట్టవిరుద్ధతగానీ, వైపరీత్యంగానీ లేదు. ఎక్కడో కాదు...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ ఎన్టీ రామారావు అధికారంలోకొచ్చిన ఆర్నెల్లలోనే స్వయానా అల్లుడైన చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్న వైనాన్ని ఎవరూ మరిచిపోరు. తనకు తిరుగులేని ఆధిపత్యం ఉన్న కాలంలో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాల్లో సీఎంలను ఎలా మార్చేదో అందరికీ తెలుసు. దేశంలో అలాంటి ఉదంతాలు పదులకొద్దీ జరిగిన నేపథ్యాన్ని గుర్తుంచుకుంటే శశికళ ఎన్నిక అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జరిగిందని చెప్పాలి. శశికళపై ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో కొద్దిరోజుల్లోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్నదని...ఈలోగా తొందరేమి వచ్చిందని కొందరంటున్నారు. శశికళను అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ తమ నేతగా ఎన్నుకున్నది. ప్రస్తుతం చట్టసభ సభ్యత్వం లేకపోవడంగానీ, సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుండటంగానీ చట్టపరంగా ఆమెకు అవరోధాలు కాదు. లెజిస్లేచర్ పార్టీ ఎన్నుకున్నాక సీఎం కాకుండా శశికళను ఎవరూ అడ్డుకోలేరు. ఆ పదవిలోకొచ్చాక సుప్రీంకోర్టులో ఆమెకు ప్రతికూలంగా తీర్పు వెలువడితే అది వేరే విషయం. మొన్నటివరకూ జల్లికట్టు ఆందోళనతో అట్టుడికిన తమిళనాట రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. -
జయకు కేసీఆర్ అభినందనలు
హైదరాబాద్ : అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆమె శుక్రవారం మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ ఈ రోజు ఉదయం ఫోన్లో జయను అభినందించారు. అక్రమాస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. జయలలిత శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలుస్తారు. మరోవైపు సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. -
శాసనసభాపక్షనేతగా జయలలిత ఎన్నిక
చెన్నై: అన్నాడీఎంకే శాసనసభా పక్షనేతగా జయలలిత మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం అన్నాడీఎంకే శసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు మళ్లీ తమ నేతగా జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జయలలితఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలవనున్నారు. శనివారం ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరోవైపు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈరోజు సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. -
నేడు తమిళనాడు సీఎం రాజీనామా
చెన్నై: అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా బయటపడ్డ అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. జయలలిత ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా, ప్రస్తుత తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం రాజీనామా చేయనున్నారు. ఈ రోజే సెల్వం రాజీనామా చేయవచ్చని భావిస్తున్నారు. ఈ నెల 16న జయలలిత తమిళనాడు సీఎంగా ప్రమాణం చేయవచ్చని సమాచారం. జయలలితకు ఈ రోజు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. జయలలితపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఆమెతో పాటు ఉన్న మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఈ కేసులో పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.