నెరవేరిన శశి‘కల’
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన రెండు నెలల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఇప్పటికే అన్నా డీఎంకే సారథ్య బాధ్యతలను స్వీకరించిన జయ ఆప్తురాలు వి.కె. శశికళ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికై ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి సిద్ధపడుతున్నారు. మంగళవారమే ఆమె పదవీ స్వీకార ప్రమాణం చేస్తారన్న వార్తలు తొలుత వెలువడ్డా తమిళనాడు బాధ్యతలను కూడా చూస్తున్న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగరరావు సోమవారం రాత్రి వరకూ అందుకు సంబంధించిన నిర్ణయమేదీ తీసుకోకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను ఆయన ఆమోదించారు గనుక సాధ్యమైనంత త్వరలోనే రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతారని భావించాలి.
ఆ సంగతలా ఉంచి వారసత్వ రాజకీయాలకు అలవాటుపడిపోయిన దేశ ప్రజలకు తమిళనాట పరిణామాలు వింత అనిపించవచ్చు. కష్టకాలంలో సైతం జయకు శశికళ అత్యంత సన్నిహితంగా మెలిగిన సంగతి వాస్తవమే. అయితే ఆ సాన్నిహిత్యం ఆమెకు పార్టీతోపాటు ప్రభుత్వాన్ని కూడా దక్కేలా చేస్తుందని ఎవరూ అనుకుని ఉండరు. జీవించి ఉండగా తన బంధుగణంలోని వారెవరినీ జయలలిత తన దగ్గరకు రానీయలేదు. అదే సమయంలో శశికళకు కూడా పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఎలాంటి పదవులూ ఇవ్వలేదు. పార్టీకి సంబంధించిన ఏ వేదికలపైనా ఆమె మాట్లాడిన దాఖలాలు లేవు. ఆమె ద్వారా పార్టీ శ్రేణులకు జయ వర్తమానం పంపించిన వైనమూ లేదు. అయినప్పటికీ అనుక్షణమూ వెన్నంటి ఉండటంవల్ల జయ వారసురాలు శశికళేనన్న నిశ్చితాభిప్రాయానికి పార్టీ శ్రేణులు వచ్చి ఉండొచ్చు. అటు పన్నీరుసెల్వం కూడా జయలలితకు సన్నిహితుడే కాక నమ్మినబంటు. ఆమెకు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తిన రెండు సందర్భాల్లో సీఎం బాధ్యతలు స్వీకరించినా సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భంలో సైతం జయ ఆదేశాలకోసం ఎదురుచూశారు తప్ప చొరవ ప్రదర్శించలేదు.
అంతేకాదు జయకు ఏర్పడిన చిక్కులు పరిష్కారమయ్యాక మళ్లీ ఆ పదవిని బహుజాగ్రత్తగా ఆమెకు అప్పగించడంలో పన్నీరుసెల్వం విధేయత తిరుగులేనిది. ఆ అర్హత కారణంగానే జయ అస్వస్థురాలైనప్పుడు కూడా ఆ బాధ్యతలను పన్నీరుసెల్వం చేతిలో పెట్టారు. జయ మరణానంతరం మరోసారి ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక పార్టీని శశికళ చూసుకుని ప్రభుత్వాన్ని పన్నీరుసెల్వానికే అప్పజెబుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అన్నిటిపైనా పట్టు సాధించుకున్నాకే ఆమె సీఎం పదవి చేపట్టువచ్చునని విశ్లేషణలొచ్చాయి. శశికళకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ గతానుభవం లేకపోవడమే వీటన్నిటికీ ప్రాతిపదిక. కొద్దిరోజుల్లోనే శశికళ తనేమిటో నిరూపించుకున్నారు. వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ చాలా త్వరగానే తాను అనుకున్నది సాధించుకోగలిగారు.
బాహాటంగా కనబడకపోవచ్చుగానీ ఇదంతా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా జరిగిందనడానికి లేదు. పదవిని కాపాడుకోవడానికి పన్నీరుసెల్వం చేతనైన ప్రయత్నం చేశారు. ఆయనకు కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ ఆశీస్సులు ఉండటం రహస్యమేమీ కాదు. పన్నీరుసెల్వంను సీఎం పదవిలో కొనసాగించడం కోసం కేంద్రంలోని బీజేపీ పెద్దలు రాయబారాలు సాగించి శశికళకూ, ఆయనకూ మధ్య సామరస్యాన్ని కుదిర్చారని...అందువల్ల జయ మరణాన్ని ప్రకటించడం కాస్త ఆలస్యమైందని కథనాలు వెలువడ్డాయి. ఆమధ్య రాష్ట్రంలో జరిగిన సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు, ఇతర పరిణామాలు పన్నీరుసెల్వం స్థితిని పటిష్టపరచడంలో భాగమన్న ఊహాగానాలొచ్చాయి. కానీ స్వతస్సిద్ధమైన శక్తియుక్తులున్నప్పుడు మాత్రమే వెలుపలి సాయం అక్కరకొస్తుంది. అది లేనప్పుడు బయటివారు చేయగలిగేది ఏమీ ఉండదు. ప్రచారానికి దూరంగా ఉండటం... నిమిత్తమాత్రుడిగా వ్యవహరించడం... ముఖ్యమంత్రి పదవిని సైతం ఒక ఉద్యోగంలా భయభక్తులతో చేయడం పన్నీరుసెల్వానికి అలవాటు. సీఎం పదవిలో ఉన్నా తనకంటూ పార్టీలో వర్గాన్ని ఏర్పాటు చేసుకొనే ప్రయత్నం ఆయనెప్పుడూ చేయలేదు. జయలలిత ఉన్నప్పుడు వీటన్నిటినీ ఎవరైనా సానుభూతితో అర్ధం చేసుకుంటారు. కానీ ఆమె మరణించాక కూడా పన్నీరుసెల్వం ఆ బాణీనే కొనసాగించారు.
ఇప్పుడు శశికళ ముఖ్యమంత్రి కావడంపై ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే, మరో పార్టీ కాంగ్రెస్‌లతోపాటు బీజేపీ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెరవెనక ఏం జరిగినా తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇప్పుడు అన్నా డీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా శశికళ ఎన్నిక కావడంలో చట్టవిరుద్ధతగానీ, వైపరీత్యంగానీ లేదు. ఎక్కడో కాదు...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ ఎన్టీ రామారావు అధికారంలోకొచ్చిన ఆర్నెల్లలోనే స్వయానా అల్లుడైన చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్న వైనాన్ని ఎవరూ మరిచిపోరు. తనకు తిరుగులేని ఆధిపత్యం ఉన్న కాలంలో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాల్లో సీఎంలను ఎలా మార్చేదో అందరికీ తెలుసు.
దేశంలో అలాంటి ఉదంతాలు పదులకొద్దీ జరిగిన నేపథ్యాన్ని గుర్తుంచుకుంటే శశికళ ఎన్నిక అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జరిగిందని చెప్పాలి. శశికళపై ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో కొద్దిరోజుల్లోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్నదని...ఈలోగా తొందరేమి వచ్చిందని కొందరంటున్నారు. శశికళను అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ తమ నేతగా ఎన్నుకున్నది. ప్రస్తుతం చట్టసభ సభ్యత్వం లేకపోవడంగానీ, సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుండటంగానీ చట్టపరంగా ఆమెకు అవరోధాలు కాదు. లెజిస్లేచర్ పార్టీ ఎన్నుకున్నాక సీఎం కాకుండా శశికళను ఎవరూ అడ్డుకోలేరు. ఆ పదవిలోకొచ్చాక సుప్రీంకోర్టులో ఆమెకు ప్రతికూలంగా తీర్పు వెలువడితే అది వేరే విషయం. మొన్నటివరకూ జల్లికట్టు ఆందోళనతో అట్టుడికిన తమిళనాట రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.