గుర్తు పట్టాలని!
► చేజారకుండా శశి వర్గం జాగ్రత్తలు
► తమకే దక్కుతుందని పన్నీర్ ధీమా
► దీప సైతం ఎదురుచూపులు
► ఎన్నికల కమిషన్ నిర్ణయం కీలకం
రాష్ట్రంలోని అనేక ద్రవిడ పార్టీల్లో ప్రధానమైన అన్నాడీఎంకేపై రసవత్తర చర్చ మొదలైంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో రెండాకుల చిహ్నం ఏవర్గానికి దక్కేనో, మరెవరి వర్గం వైపు మొగ్గేనో అని ఆసక్తికరమైన విశ్లేషణలో పార్టీలు మునిగితేలుతున్నాయి. రెండాకుల గుర్తును నిలబెట్టుకునేందుకు శశికళ, సాధించుకునేందుకు పన్నీర్ పాటుపడుతుండగా, అనుకూల పవనాల కోసం జయ మేనకోడలు దీప కాచుకుని ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: 1972 అక్టోబరు 17వ తేదీన ఎంజీ రామచంద్రన్ స్థాపించిన ఈ పార్టీకి 1.50 కోట్ల సభ్యత్వంతో బలమైన క్యాడర్ ఉంది. ఎంజీఆర్ బొమ్మ, అమ్మ ఫొటోలు అన్ని ఎన్నికల్లో అతి ప్ర ధాన ఆకర్షణలు. వీటికి తోడు పార్టీ రెండాకుల చిహ్నం కనపడితేచాలు బ్యాలెట్ పేపర్‌పై ముద్రవేసే ఓటు బ్యాంక్ అన్నాడీఎంకేకు సొంతం. పార్టీకి ఆనేతలు ఎంత బలమో ప్రజల హృదయాల్లో నాటుకుపోయిన రెండాకుల చిహ్నం కూడా అంతేబలం. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం, శశికళ బాధ్యతల స్వీకరణ, పన్నీర్‌సెల్వం తిరుగుబాటు, జయకు అసలైన రాజకీయ వారసురాలిని తానేనంటూ ఆమె మేనకోడలు దీప గళమెత్తారు. దీంతో అన్నాడీఎంకే అనుచరులు మూడుగా చీలిపోయారు. సభ్యులు సైతం ఎవరికి నచ్చిన చోట వారు చేరిపోయారు. 1.50 కోట్ల పార్టీ సభ్యత్వం సైతం మూడు వర్గాలుగా మారిపోయింది.
అన్నాడీఎంకేలోని మూడు వర్గాలూ అమ్మ బొమ్మ చూ పించే ఎన్నికల బరిలో దిగ డం తప్పనిసరి. అయితే వీటన్నికం టే గెలుపు గుర్రం ఎక్కించే రెండాకుల చిహ్నం ఇంకా ఎంతో ముఖ్యం. అమ్మ మెచ్చిన నేత అనే సెంటిమెంట్ బలాన్ని పన్నీర్‌సెల్వం కలిగి ఉన్నా, జయ మేనకోడలిగా అసలైన రాజకీయ వారసురాలు అనే ముద్ర దీప సొంతమైనా ఇవన్నీ బ్యాలెట్ పేపరులో ప్రతిబంబించవు. బ్యాలెట్ పేపరులో ఓటరుకు కనపడేది రెండాకుల చిహ్నం మాత్రమే. రెండాకుల చిహ్నం కనపడితే చాలు ఆవేశంతో ఊగిపోయినట్లుగా బ్యాలెట్‌పై ఓటరు తన రాజ ముద్రను వేసేస్తారని ఒక డీఎంకే నేతనే అంగీకరించాడు.
ఓటర్లపై అంతటి ప్రభావం చూపగలిగిన సత్తా కలిగి ఉండటం వల్లే రెండాకుల చిహ్నం కోసం ముగ్గురూ పోటీపడుతున్నారు. ఐదేళ్ల సభ్యత్వం లేని కారణంగా ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని పన్నీర్‌సెల్వం ప్రధాన ఎన్నికల కమిషన్ వద్ద సవాల్ చేసి ఉన్నారు. పన్నీర్ వాదనతో ఎన్నికల కమిషన్ ఏకీభవించినపక్షంలో శశికళ పదవీచ్యుతురాలు కాగలరు. తద్వారా పార్టీ పగ్గాలు, రెండాకుల గుర్తు తన చేతికి వస్తాయని పన్నీర్ ఆశిస్తున్నారు. అయితే సీఈసీ నిర్ణయం ప్రతికూలంగా మారినపక్షంలో పార్టీ చేజారిపోకుండా తన వర్గంలో ఉండే ఐదేళ్ల సభ్యత్వ సీనియారిటి కలిగి ఉన్న వ్యక్తిని శశికళ తన స్థానంలో నిలిపే అవకాశం ఉంది.
తన రాజకీయ ప్రవేశ లక్ష్యం పార్టీని, రెండాకుల చిహ్నన్ని స్వాధీనం చేసుకోవడమేని దీప ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. రెండాకుల చిహ్నం దక్కించుకోవడంలో దీపకు ఇప్పట్లో సాధ్యం కాదు. అయితే రెండాకుల చిహ్నం శశికళకా, పన్నీరుకా ఎవరికి సొంతం అనే అంశంపై సీఈసీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. శశికళ ఎంపిక చెల్లదని సీఈసీ ప్రకటించినట్లయితే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె చేసిన నియామకాలు, తీసుకున్న నిర్ణయాలన్నీ రద్దయిపోతాయి. ఎన్నికల పోలింగ్‌లోగా సీఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించని పక్షంలో పరిస్థితి మరోరకంగా మారుతుంది. అన్నాడీఎంకే తరపున ఆర్కేనగర్‌లో పోటీచేసే అభ్యర్దులకు తగిన వ్యక్తి బీఫాంపై సంతకం చేసినపుడే రెండాకుల చిహ్నం కేటాయించబడుతుంది.
సర్వసభ్య సమావేశం ద్వారా ఎంపికైన శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమే కాబట్టి బీఫాంపై ఆమె సంతకం చెల్లదని పన్నీర్ వర్గం వాదిస్తోంది. అంతేగాక శాశ్వత కార్యదర్శి హోదాలో జయ చేత నియమితులైన ప్రిసీడియం చైర్మన్ మదుసూధనన్ సంతకంతో బీఫారాలు జారీచేస్తామని కూడా పన్నీర్ అనుచరులు చెబుతున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికపై మరో రెండు రోజుల్లో నామినేషన్లను స్వీకరించనున్న తరుణంలో రెండాకుల చిహ్నం వివాదం కీలకంగా మారింది. ఇంతటి గందరగోళ పరిస్థితుల్లో రెండాకుల చిహ్నం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.