బొగ్గుకేసులో సీబీఐకి ప్రత్యేక కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో కమల్ స్పాంజ్ స్టీల్, పవర్ లిమిటెడ్ సంస్థపై కేసు ముగిసిందన్న సీబీఐ నివేదికపై ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం సునిశితమైన ప్రశ్నలు సంధించింది. కమల్ స్పాంజ్ సంస్థపైన, సంస్థ డెరైక్టర్లపై కేసుకు తగిన ఆధారాలు లేవంటూ సీబీఐ ఇచ్చిన నివేదికపై వాదనల నేపథ్యంలో కోర్టు ఈ ప్రశ్నలు వేసింది. ఆ సంస్థపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని ఏ అంశానికి ఆధారాలు దొరకలేదో వివరణ ఇవ్వాలని, ప్రాథమిక విచారణ దశనుంచి, ఎఫ్‌ఐఆర్ స్థాయివరకూ దర్యాప్తునకు అసలు ప్రాతిపదిక ఏమిటో వివరించాలని అదనపు సెషన్స్ న్యాయమూర్తి భరత్ పరాశర్ ఆదేశించారు.
ప్రాథమిక విచారణలో రికార్డుచేసిన అంశాలపై మీరు సేకరించలేకపోయిన ఆధారాలేమిటి?, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక మినహా సమీకరించిన ఆధారాలేమిటి? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రాథమిక స్థాయినుంచి దర్యాప్తును సాగించేందుకు మీకున్న ప్రాతిపదిక ఏమిటి? ప్రాథమిక విచారణ దశలోనే ఎందుకు ఆగలేకపోయారని ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.
కమల్ స్పాంజ్ కేసు పై వివరణ ఇవ్వండి
Published Wed, Sep 10 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement