తీవ్ర రూపం దాల్చిన రవి అభిమానుల ఆందోళన
కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడి
బెంగళూరు(బనశంకరి) : దివంగత ఐఏఎస్ అధికారి డీకే.రవి మృతికి సంబంధించి సీబీఐ నివేదిక బయటపెట్టడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిసూ ఆమె తల్లి గౌరమ్మ, రవి అభిమానులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం నగరంలోని కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడించారు. వివరాలు.. రవిది ఆత్మహత్య, లేక హత్య అనే విషయంపై తేల్చాలని డిమాండ్ చేస్తూ రవి తల్లి తల్లి గౌరమ్మ తండ్రి కరియప్పలు ఆనంద్‌రావ్ సర్కిల్‌లో అహోరాత్రి ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రహోంశాఖమంత్రి పరమేశ్వర్, ఇంధన శాఖ మంత్రి డికే.శివకుమార్ ఆందోళనకారుల వద్దకు చేరుకొని రవి మృతికేసును సీబీఐ కి అప్పగించామని, నివేదిక ను త్వరగా విడుదల చేయాలని మనవి చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే ఆమేరకు ఎలాంటి నివేదిక విడుదల కాలేదు. దీంతో కోపోద్రిక్తులైన రవి అభిమానులు ఆదివారం కేంద్రమంత్రులైన డీవీ.సదానందగౌడ, అనంతకుమార్, మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప ఇళ్లను ముట్టడించారు. సీబీఐ నివేదికను ప్రకటించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ ఆ దిశగా స్పందించడం లేదని గొడవకుదిగారు.
తాము నడి వీధిలో కూర్చుని పోరాటం చేస్తుండగా సదానందగౌడ అభిమానులతో కలిసి పుట్టినరోజు నిర్వహించుకున్నారని, ఒక్కసారి కూడా రవి తల్లిని పరామర్శించడానికి రాలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంవడగా ధర్నాలో పాల్గొన్న డికే.రవి తండ్రి కరియప్ప అస్వస్థతకు గురవ్వడంతో ఎంఎస్.రామయ్య ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.