పాట్నా: బిహార్ గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. 29 ఏళ్ల క్రితంఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ.. తాజాగా బయటకొచ్చారు. ఏలాంటి హడావిడీ లేకుండా గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన్ను రిలీజ్ చేశారు అధికారులు. కాగా తన కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ నిశ్చితార్థం కోసం 15 రోజుల పెరోల్‌పై ఇటీవలే బయటికొచ్చిన ఆనంద్ మోహన్.. పెరోల్ ముగించుకొని నిన్ననే పోలీసులకు సరెండర్ అయ్యారు. అంతలోనే విడుదలై బయటకు రావడం గమనార్హం.
కాగా ఆనంద్ మోహన్ విడుదలను ఐఏఎస్ కృష్ణయ్య భార్య ఉమా వ్యతిరేకించారు. తన భర్త చనిపోవడానికి కారణమైన నిందితుడిని ఎందుకు విడుదల చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లనాటి ఘటన ఇంకా కళ్ల ముందు కనిపిస్తోందని వాపోయారు. ఇలా క్రిమినల్స్‌ను విడుదల చేస్తే రాజకీయ నాయకుల అండ చూసుకుని మరింత మంది రెచ్చిపోతారని తెలిపారు నేరస్థులకు ప్రభుత్వం మద్దతు తెలపడం సరికాదని, బిహార్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఈ మేరకు నంద్ మోహన్ విడుదల ఆపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐఏఎస్ భార్య విజ్ఞప్తి చేశారు.
చదవండి: స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశం.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ప్రధానికి కన్నీటి వేడుకోలు
ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై జోక్యం చేసుకోవాలని ప్రధాని కృష్ణయ్య కుమార్తె పద్మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘ప్రధాని మోదీని నేను వేడుకుంటున్నాను. దయచేసి ఆనంద్‌లాంటి వ్యక్తులను తిరిగి సమాజంలో తిరగనివ్వద్దు. దీనిపై పోరాడే శక్తి మాకు లేదు. అలాంటి గ్యాంగ్‌స్టర్లు, మాఫియాలు బీహార్‌లో లేదా మరే రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా సంచరించకుండా చట్టం తీసుకురావాలి. మా నాన్న గురించి తెలియకపోతే బీహార్ ప్రజలను అడగండి. 29 ఏళ్లు గడిచినా ఇప్పటికీ కూడా ప్రజలు దీనిపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి నిర్ణయాన్ని పునరాలోచించండి. మాకు ఇది తగిన న్యాయం కాదు’ అని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదిలా ఉండగా ఐఏఎస్ అధికారి కృష్ణయ్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తే. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్. కృష్ణయ్య మృతి తర్వాత ఆయన భార్య హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. ప్రస్తుతం నిహారిక బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. పద్మ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
అయితే ఇటీవల నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ జైలు మన్యువల్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. నీతీష్ సర్కారు రూల్స్ మార్చడంతో.. గత 15 ఏళ్లుగా జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమమైనట్లు అయ్యింది. అనుకున్నట్లుగానే యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 27 మంది ఖైదీల విడుదలకు ఈనెల 24న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా.. అందులో ఆనంద్ మోహన్ పేరు కూడా ఉండటం తీవ్ర దుమారానికి తెరలేపింది. గ్యాంగ్‌స్టర్ కోసమే నీతీశ్ జైలు నిబంధనలు మార్చేశారంటూ విపక్షాలు తీవ్రంగా మండిపడుతుండగా.. దేశంలోని ఐఏఎస్‌లు సైతం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో ఈ వ్యవహారం పెద్ద రాజకీయ వివాదంగా మారింది.
చదవండి: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అమిత్‌షాపై కాంగ్రెస్ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment