
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పాకిస్తాన్‌లో కూర్చుని భారత్‌లో ఉగ్ర దాడులను ప్రేరేపించే ఉగ్రవాద సంస్థలు, వాటి అధినేతల ఆగడాలకు అడ్డుకట్ట పడేవరకూ ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్‌లు ఆడరాదని ఆ పార్టీ ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు. ఉగ్రదాడిపై విపక్షాలను మౌనం దాల్చేలా పాలక మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
తమ వైఫల్యాలను ప్రశ్నించిన వారికి బదులివ్వకుండా వారిని పాక్ సానుభూతిపరులుగా ముద్ర వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము గట్టి ప్రశ్నలు వేయడం జాతీయ భద్రతను బలోపేతం చేస్తుందని తాము పాక్ వాదనను వినిపిస్తున్నామన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తెరగాలన్నారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో ప్రధాని ఓ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియో క్లిప్‌ను మనీష్ తివారీ ప్రదర్శించారు.
అత్యంత విషాద ఘటన చోటుచేసుకున్న సమయంలో రెండు గంటల పాటు ప్రధానికి ఆ సమాచారం చేరవేయలేదా అని సందేహం వ్యక్తం చేశారు. ప్రధానికి దాడి విషయం తెలిస్తే దాని గురించి తన ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావనా లేకుండా ముగించడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. ప్రధానికి, పీఎంఓకు మధ్య సమాచార లోపం సర్కార్ అసమర్ధతకు సంకతేమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment