తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాను మీడియాకు చూపుతున్న సింఘ్వీ. చిత్రంలో మర్రి, జంధ్యాల
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికల దృష్ట్యా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో వెలుగుచూసిన అవకతవకలపై విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 70 లక్షల ఓట్లపై తమకు అనుమానాలున్నాయని వెల్లడించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎంపీ అభిషేక్ సింఘ్వీ, సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఆదివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ తన వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు ఓటర్ల జాబితా తయారీలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని సింఘ్వీ ఆరోపించారు.
సెప్టెంబర్ 10న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 70 లక్షల ఓట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్నారు. ఇందులో 30.13 లక్షల నకిలీ ఓటర్లున్నారని, 20 లక్షల వ్యతిరేక ఓట్లను కేసీఆర్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి తొలగింపజేశారని, మరో 18 లక్షల ఓటర్లు ఏపీ, తెలంగాణలో రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. గత ఎన్నికల్లో 2.81 కోట్లున్న తెలంగాణ ఓటర్ల సంఖ్య ఇప్పుడు 2.61 కోట్లకు చేరుకుందన్నారు. ఇందులో 20 లక్షల ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు.
దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. తొలగించిన 20 లక్షల ఓటర్లు ఏపీకి తమ ఓటు హక్కును మార్చుకున్నట్టు సమాధానమిచ్చారని, అయితే ఏపీలో కూడా ఇదే సాకుగా చూపుతూ 17 లక్షల ఓట్లను తొలగించారని వివరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర ఎన్నికల అధికారులను పిలిపించి వ్యతిరేక ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. తెలంగాణలో ఒక నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల పేర్లు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయని, ఇదే విషయమై ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే వారు కూడా ఈ విషయాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పారు. ఇక పోలవరం ముంపు మండలాల్లోని ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఓటర్లుగా ఉన్నారని సింఘ్వీ వెల్లడించారు.
ఓటర్ల జాబితాలో 2017 ఏళ్ల వారున్నారు!
21 వేల మంది ఓటర్ల వయసు చూస్తే అప్పుడే పుట్టిన శిశువు వయసు నుంచి 2017 ఏళ్ల (క్రీస్తు పూర్వం) వయసున్న వారు తెలంగాణలో ఓటర్లుగా ఉన్నారని మర్రి శశిధర్‌రెడ్డి, జంధ్యాల వివరించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి అని, అలా కాకుండా అవకతవకలతో కూడిన ఓటర్ల జాబితాతోనే ఎన్నికలకు వెళ్తే తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారు తెలిపారు. ఎన్నికలకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని, ఇలా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఎన్నికలకు వెళ్తే అంగీకరించబోమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment