చొరబాట్లే ప్రచారాయుధం | Congress hopes on Bengali Muslim | Sakshi
Sakshi News home page

చొరబాట్లే ప్రచారాయుధం

Published Sun, Apr 10 2016 1:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

చొరబాట్లే ప్రచారాయుధం - Sakshi

చొరబాట్లే ప్రచారాయుధం

అస్సాం ఎన్నికల ముఖచిత్రం
♦ బంగ్లా నుంచి చొరబాట్లను అడ్డుకుంటాం: బీజేపీ
♦ దిగువ అస్సాంలోని బెంగాలీ ముస్లింలపై కాంగ్రెస్ ఆశలు
♦ జంగల్‌మహల్‌లో తృణమూల్, లెఫ్ట్ కూటమి హోరాహోరీ
 
 సాక్షి, సెంట్రల్ డెస్క్: అస్సాం అసెంబ్లీ రెండోదశ, బెంగాల్ మొదటి దశ రెండో భాగం ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఏప్రిల్ 11న ఈ రెండు రాష్ట్రాల్లోను ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ కూటమిలు హోరాహోరీ తలపడుతుండగా... బెంగాల్‌లో తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్-కాంగ్రెస్ కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. బంగ్లా చొరబాట్లు, బెంగాలీ ముస్లింల ఓటు బ్యాంకు అస్సాం భవితను తేల్చనున్నాయి. రెండో దశలో దిగువ, మధ్య అస్సాంలోని మొత్తం 61 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 523 మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

 అక్రమ చొరబాట్లే ప్రధాన ప్రచారాస్త్రం
 రెండో దశ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రం చేసుకున్నాయి. అక్రమంగా అస్సాంలోకి వచ్చిన బంగ్లాదేశీయులను కాంగ్రెస్ కాపాడుతోందంటూ బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. దిగువ, మధ్య అస్సాంలోని చాలా నియోజకవర్గాల్లో బెంగాలీ ముస్లింల ఓట్లు అధికం. కొన్నేళ్లుగా ఈ నియోజకవర్గాలు కాంగ్రెస్‌కు పెట్టని కోటలుగా ఉన్నాయి. ఈ సారి పరిస్థితి తిరగబడింది. మార్పు, అభివృద్ధి కాకుండా అక్రమ చొరబాట్లకు శాశ్వత పరిష్కారం కావాలని ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. దాన్నే బీజేపీ ప్రచారాస్త్రం చేసుకుని కాంగ్రెస్ కోటల్ని బద్దలు కొట్టాలని చూస్తోంది.

తాము అధికారంలోకి వస్తే చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు, వారికి ఉద్యోగాలిచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రచారం చేసింది. అభివృద్ధి కోసం మార్పుకు పట్టం కట్టాలని  విజ్ఞప్తి చేసింది. బొడో పీపుల్స్ ఫ్రంట్‌తో పొత్తుపెట్టుకున్న బీజేపీ బొడోలాండ్‌లోని మెజార్టీ సీట్లు గెల్చేందుకు ప్రయత్నించింది. చొరబాట్లకు పరిష్కారం చూపుతున్నామని, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్‌ను(పౌరుల జాతీయ జాబితా) ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్న బీజేపీ విమర్శల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. రాష్ట్రంలో బంగ్లాదేశీయులు లేరని, ఒక్క అక్రమణదారుడుఉన్నా తాను రాజీనామా చేస్తానంటూ సీఎం గొగొయ్ సవాలు విసిరారు. గత 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో శాంతిని నెలకొల్పామని ఆ పార్టీ ప్రచారం చేసుకుంది. బెంగాలీ ముస్లిం ఓట్లతో గట్టెక్కవచ్చని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.

 తృణమూల్- లెఫ్ట్ కూటమి హోరాహోరీ
 పశ్చిమబెంగాల్లో మొదటి దశ రెండో భాగంలో మొత్తం 31 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జంగల్‌మహల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో 13 నియోజవర్గాలు, బంకూరాలో 9, బుర్ద్వాన్‌లో 9 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తారు.  బీజేపీ తరఫున ప్రధాని మోదీ, బీజేపీ  చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పలు సభలో మాట్లాడారు. సీఎం మమత దాదాపు అన్ని నియోజకవర్గాల్ని చుట్టేశారు.
 
 చొరబాట్లను వాజ్‌పేయి అడ్డుకోలే కపోయారు: అమిత్ షా
 గువాహటి/కాండీ: బంగ్లా చొరబాట్ల సమస్యను మాజీ ప్రధాని వాజ్‌పేయి పరిష్కరించలేకపోయారని బీజేపీ చీఫ్ అమిత్ షా శనివారం గువాహటిలో అన్నారు. ఆనాడు బంగ్లాతో సరిహద్దు ఒప్పందం లేకపోవడంతో రక్షణ కంచె పూర్తి కాలేదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా  చెప్పారు. ప్రస్తుతం ఒప్పందం చేసుకోవడంతో అక్రమ చొరబాట్లను అడ్డుకుంటామన్నారు.

 జైల్లో పెట్టినా భారీ మెజార్టీతో గెలుస్తాం.. తృణమూల్ కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ అవినీతి పార్టీ అనడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ధైర్యముంటే తనను జైల్లో పెట్టాలని దీదీ సవాల్ విసిరారు. జైల్లో ఉన్నా ఎన్నికల్లో భారీ మెజార్టీతో సత్తా చాటుతామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement