సీట్ల పంపకాలపై లెక్కలు తేలకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది.
సాక్షి ముంబై: సీట్ల పంపకాలపై లెక్కలు తేలకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ముంబైతోపాటు రాష్ట్రంలోని 118 నియోజకవర్గాలకు పార్టీ తరఫున బరిలోకి నిలిచేవారి తొలిజాబితాను ప్రకటించింది. అదనపు స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్న ఎన్సీపీపై పైచేయి సాధించేందుకే కాంగ్రెస్ ఈ తొలిజాబితాను విడుదల చేసిందని చెబుతున్నారు.
గత కొన్నిరోజులుగా చర్చల్లోకెక్కిన దక్షిణ కరద్, నవాపూర్, మాలెగావ్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు చర్చల్లో ఉన్న కొన్ని స్థానాలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడం విశేషం. 2009 ఎన్నికల్లో నవాపూర్, మాలెగావ్ అసెంబ్లీ నియోజకవర్గాలపై చర్చలు విఫలమై పొత్తులు వికటించే వరకు వచ్చింది. అయితే ఈసారి ఈ రెండు నియోజకవర్గాలపై మళ్లీ చర్చలు జరిగే సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
మరో వైపు కాంగ్రెస్‌లో అంతర్గత విబేదాలు పొడసూపే అవకాశాలున్నాయని భావించే దక్షిణ కరద్ నియోజకర్గం నుంచి ముందు నుంచి చెబుతున్నట్టుగానే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేరును ప్రకటించింది. తొలిజాబితాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులైన నారాయణ రాణే, పతంగ్‌రావ్ కదం, బాలాసాహెబ్ థోరత్, రాధాకృష్ణ విఖేపాటిల్, హర్షవర్ధన్ పాటిల్, రాజేంద్ర దర్డా, సురేశ్ శెట్టి, నితన్ రావుత్, మధుకర్‌రావ్ చవాన్, నసీం ఖాన్, వర్షా గైక్వాడ్, పద్మాకర్ వాల్వి, అబ్దుల్ సత్తార్, సతేజ్ పాటిల్, రాజేంద్ర గావిత్, డీపీ సావంత్, రంజిత్ కాంబ్లే, అమిత్ దేశ్‌ముఖ్ తదతర మంత్రుల పేర్లున్నాయి.
యువతకు ప్రాధాన్యమేది?
అత్యంత వయోవృద్ధులైన అప్పాసాహెబ్ పాటిల్‌కు కాంగ్రెస్ మళ్లి టిక్కెట్ ఇచ్చింది. మాజీ సహాయక మంత్రి విజయ్ వడెట్టివార్‌కు ఈసారి చిమూర్‌కు బదులుగా బ్రహ్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఇవ్వగా మాజీ ఎమ్మెల్యే అవినాష్ వారజుర్కర్‌ను చిమూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు, మాజీ మంత్రి బి. దేశాయి కూతురైన సుశోబెన్ షాకు దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించింది. అయితే వీరంతా రాజకీయాల్లో తలపండినవారే.
ఒక్కొక్కరికి కనీసం 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఈ సారి కూడా వారికే టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ యువనాయకుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో యువతకు ప్రాధాన్యమివ్వడం లేదని కొంతమంది బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. అయితే మలి జాబితా మొత్తం యువకులతోనే నిండి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.