జైట్లీ ఉద్యోగాలెక్కడ?: కాంగ్రెస్
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుతో భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని ఉద్యోగాలెక్కడ? అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఓ బహిరంగ లేఖ రాసింది. నోట్లరద్దు వంటి సర్జికల్ దాడితో పేద ప్రజలను ఆర్థికంగా దెబ్బతీశారని విమర్శించింది. ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం ఎలా గట్టెక్కిస్తుందో సమాధానం చెప్పాలని జైట్లీని ప్రశ్నించింది.
నోట్ల రద్దుతో కార్మిక శాఖ లెక్కల ప్రకారం దేశంలో 1.6 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని లేఖలో ప్రస్తావించింది. 15 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయారని పేర్కొంది. మీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పేదరికాన్ని మరింత పెంచిందని దుయ్యబట్టింది.
నిరుద్యోగులకు సంబంధించి సర్వేలు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించింది. నోట్ల రద్దుతో ఉత్పాదక రంగంలో 9 ఏళ్లు వెనకబడ్డామని, ఎగుమతులు క్షీణించాయని , వడ్డీ రేట్లు బాగా పెరిగాయని తెలిపింది. కానీ పెట్టుబడులు మాత్రం పెరగడం లేదని ఎద్దేవ చేసింది. నిర్మాణ రంగంలో వృద్ధిలేక వేల ఉద్యోగాలు కోల్పోయామని పేర్కొంది. కరువుతో వ్యవసాయ రంగం కుదేలైందని, రైతులకు రుణాలివ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది.
నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో అసంఘటిత రంగంలో చాల మంది యువత ఉపాధి కోల్పోయారని వెల్లడించింది. దీంతో యువత గ్రామాలకు తిరిగి వెళ్లి పనుల్లేక నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం కూడా తగ్గుతుందని పేర్కొంది.
దేశ వ్యాప్తంగా అమలు చేయాలనుకున్న కనీస వేతం కూడా అమలు కావడం లేదని, వ్యాపార ఖర్చులు పెరగడంతో చాల ఉద్యోగాలు కోల్పోవల్సి వచ్చిందని విమర్శించింది. పేద రాష్ట్రాల్లో ఖర్చులు పెరిగి కార్మికులకు జీతాలు ఇవ్వలేక పరిశ్రమలు మూత బడుతున్నాయని ఆరోపించింది.