సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. దీంతో ముంబైలోని తెలుగు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ముంబైలో బుధవారం నాటికి 3,683 మందికి కరోనా సోకగా, 161 మంది మరణించారు. బుధవారం ఒక్కరోజే 10 మంది కరోనాకు బలయ్యారు. ముంబైలోని హాట్‌స్పాట్‌లున్న ప్రాంతాల్లో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇరుకు గదుల్లో ఉండలేక, బయటకు వెళ్లలేక బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. తమను స్వగ్రామాలకు చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
8 మంది తెలుగువారికి కరోనా..
ముంబైలో 8 మంది తెలుగువారికి కరోనా సోకింది. కమాటిపురాలో ముగ్గురు, ధారావి ముకుంద్‌నగర్‌లో ముగ్గురు, వర్లీ బీడీడీ చాల్స్‌లో ఇద్దరు.. మొత్తం 8 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయా ప్రాంతాల్లో నివసించే స్థానిక తెలుగు ప్రజలు ‘సాక్షి’కి తెలిపారు. తెలుగువారు అత్యధికంగా ఉండే ‘జీ సౌత్’(వర్లీ, ప్రభాదేవి, లోయర్ పరేల్ తదితర పరిసరాలు) వార్డులో కరోనా బాధితుల సంఖ్య అధికంగా ఉంది. ఈ వార్డులో ఏప్రిల్ 21 వరకు 487 మందికి కరోనా సోకింది. మరోవైపు ‘ఇ’(భైకల్లా, కమాటిపురా తదితర పరిసరాలు)లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. ‘జీ నార్త్’(దాదర్, మాహీం, ధారావి తదితర పరిసరాలు) వార్డులో 251 కేసులు నమోదయ్యాయి. 200లకు పైగా కరోనా బాధితులున్న 7 వార్డులున్నాయి. ఆ ఏడు వార్డుల్లో వర్లీ, కమాటిపురా, ధారావితో పాటు తెలుగు ప్రజలు నివసించే సైన్, వడాలా, అం«ధేరి తదితరాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే తెలుగు వారితో ‘సాక్షి’మాట్లాడింది. చదవండి: కరోనాను కట్టడి చేస్తాం
10 లక్షలకుపైగా...
ముంబైలో సుమారు 1.2 కోట్ల జనాభా ఉండగా వీరిలో సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల మంది తెలుగు ప్రజలున్నారు. వీరిలో ముఖ్యంగా తెలంగాణ ప్రజలు సుమారు 80 శాతంకుపైగా ఉండగా ఏపీ ప్రజలు సుమారు 20 శాతం వరకు ఉంటారు. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందినవారు అధికంగా ఉన్నారు. వీరిలో సీజన్ వారీగా ముంబైకి వచ్చే వలస కూలీలు సుమారు 15 శాతం ఉండగా, 50 శాతం పైగా కూలీ పనులు చేసుకునేవారే. ఇక ఉద్యోగస్తులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సుమారు 10 నుంచి 12 శాతం ఉంటారు.
రోజూ 10 వేల మందికి భోజనం: కృష్ణవేణిరెడ్డి (కార్పొరేటర్, ముంబై)
మా వార్డులో రోజుకు దాదాపు 10 వేల మందికి భోజనాలు అందిస్తున్నాం. మా వార్డులో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలున్నారు. అవసరమున్న తెలుగు వారితో పాటు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల ప్రజలకు ఉదయం 5 వేలు, సాయంత్రం 5 వేల భోజనాల ప్యాకెట్లను పంపిణీ చేయిస్తున్నాను.
ఈ నెల కష్టమే ఉంది
ఇళ్లల్లో పని చేసి బతికే మాకు చాల ఇబ్బందిగా ఉంది. పోయిన నెల ఎలాగో గడిచింది. మా సేటమ్మలు ఎంతో కొంత ఇచ్చిన్రు. ఈ నెల ఎల్లుడు కష్టంగా ఉంది. నా పెద్ద కొడుకు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని దమ్మన్నపేటలో అమ్మమ్మ ఇంట్లో ఉంటుండు. నేను నా భార్య, చిన్న కొడుకు ముంబైలో ఉంటున్నాం.
కోడిపుంజుల రమేశ్ (మంచిర్యాల జిల్లా, వెంకట్రావ్‌పేట)
ఎట్లన్న చేసి ఊరికి పంపండి
మమ్మల్ని ఎట్టన్న చేసి మా ఊరికి చేర్చండి. ముంబై బోరివలి దౌలత్‌నగర్ మురికివాడలో ఉంటున్నాం. చిన్న గదిలో ఉంటూ నాకా కార్మికుడిగా పని చేస్తున్నా. ప్రస్తుతానికి పనులు లేవు. ఇక్కడ రేషన్ కార్డు కూడా లేదు. దీంతో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మంచిర్యాల జిల్లా మ్యాదరిపేటలో
భార్య, ఇద్దరు పిల్లలున్నారు. – సీపతి చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment