సాక్షి, హైదరాబాద్: ధారావి...ఆసియాలోనే అతిపెద్ద, అత్యధిక జనసమ్మర్దమున్న మురికివాడ ఇప్పుడు కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ఒక మోడల్‌గా, ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అభివృద్ధి ర్యాంకుల్లో, ఆధునిక సాంకేతికతలో ముందున్న దేశాలు, నగరాలు కోవిడ్ మహమ్మారి నుంచి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతుంటే.. 10 లక్షలకు పైగా జనాభాతో భారత్‌లోనే అతిపెద్ద మురికివాడగా పేరుపడిన, మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావి వైరస్ వ్యాప్తి కట్టడిలో వెలుగు దారి చూపుతోంది. వందరోజులకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులతో పోరాడి, ఐసోలేషన్ నుంచి విజయవంతంగా బయటికొచ్చి మళ్లీ తన కార్యకలాపాలను కొనసాగించడం మొదలెట్టింది. ఈ ప్రాంతంలోని చిన్నాచితకా ఫ్యాక్టరీలు, కుటీరపరిశ్రమలు, రకరకాల వృత్తుల్లో పనిచేసే వారు తమ రోజువారి జీవనపోరాటంలో మళ్లీ నిమగ్నమై తమ ధైర్యాన్ని, సాహసాన్ని చాటుతున్నారు. మే చివరి వరకు కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు కరోనా వైరస్ వ్యతిరేక పోరులో ముందంజలో నిలిచి కేంద్ర ప్రభుత్వ అభినందనలు కూడా పొందింది.
భయోత్పాతం నుంచి ...
కొన్ని నెలల క్రితం ధారావిలో మొదటి కోవిడ్ మరణం నమోదు కాగానే సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. మురికివాడల్లో, అందులోనూ కిక్కిరిసిన వీధులు, ఒక్కోగదిలో పదిమంది చొప్పున నివసించే చోటు కావడంతో అది శవాల దిబ్బగా మారడం ఖాయమనే భయాందోళనలు మిన్నం టాయి. ఈ పరిస్థితుల్లో కనిపించని శత్రువుతో పోరాటానికి ఇక్కడి వారు నడుం బిగించారు. వైరస్ వ్యాప్తి తీవ్రమై కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న సందర్భంలో అక్కడి అధికారులు సైతం వ్యూహాన్ని మార్చారు. విపత్తు సంభవించే వరకు వేచి చూడకుండా, వైరస్‌ను వెన్నాడి దానిని తుదముట్టించాలనే ఆలోచనతో ముందుకు సాగారు. వీధుల్లో తిరిగి పాజిటివ్ కేసుల కోసం శోధిస్తూ వెళ్లడం కంటే ధారావిలోని వివిధ ప్రాంతాల్లో ‘ఫీవర్ క్యాంప్’లు ఏర్పాటుచేసి ప్రతీరోజు వైరస్ లక్షణాల కోసం అక్కడి ప్రజలను స్క్రీనింగ్ చేయడం మొదలుపెట్టారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్ హాళ్లు, పాఠశాలలు ఇలా ఒకటేమిటి... అందుబాటులో ఉన్న ప్రతి భవనాన్ని క్వారంటైన్ సెంటర్లుగా మార్పుచేశారు.
ఈ సెంటర్లలోని వారికి ఆహారం, అవసరమైన విటమిన్లు, యోగ, ఇతర వ్యాయామాలు అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ వైరస్ హాట్‌స్పాట్లు ఉన్నాయో గుర్తించారు. ఆయా ఏరియాల్లో లాక్‌డౌన్ విధించడంతో పాటు పెద్ద సంఖ్యలో వాలంటీర్లు రంగంలోకి దిగి ధారావిలోని ఏ ఒక్కరూ పస్తులతో పడుకోకుండా ఆహార ప్యాకెట్లను అందించారు. వైద్యపరికరాలు, సామాగ్రిని బాలీవుడ్ సినీతారలు, వ్యాపారవేత్తలు అందజేయగా, గృహనిర్మాణ కార్మికులు ఒక పార్కులో 200 పడకల ఆసుపత్రిని నిర్మించారు. మూడునెలల తర్వాత కొత్త ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ‘జనంతో కిక్కిరిసిపోయిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణ అనేది అతిపెద్ద సవాల్‌గా నిలిచింది. స్థానికంగా ఉన్న డాక్టర్లందరినీ విశ్వాసంలోకి తీసుకుని కరోనా లక్షణాలున్న వారందరినీ ముందుగా గుర్తించాము. ఎప్పటికప్పుడు వారిని ఐసోలేట్ చేయడం, పబ్లిక్ టాయ్‌లెట్లను రోజుకు లెక్కకు మించినన్నిసార్లు శుభ్రం చేయడం మంచి ఫలితాలనిచ్చింది’అని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో జూన్‌లో రోజుకు 16 కేసుల చొప్పున ఈ మురికివాడల్లో 489 కేసులు రికార్డయ్యాయి.
మళ్లీ జీవన సమరంలోకి...
వందరోజులకు పైగా అన్నిరకాల వ్యాపారాలు బందయ్యాక, వైరస్ వ్యాప్తిని కట్టడి చేశాక ధారావి ఇప్పుడు కొత్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. అన్నిరకాల పరిశ్రమలు, వృత్తులు మళ్లీ మొదలయ్యాయి. వైరస్ భయాన్ని, దాని బారిన పడితే నూకలు చెల్లుతాయనే జీవన్మరణ సమస్యలను అధిగమించి ఇప్పుడు ధైర్యంగా ముందుకు సాగుతోంది.
కరోనా చీకటిలో ధారవి
Published Wed, Jul 8 2020 5:36 AM | Last Updated on Wed, Jul 8 2020 5:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment