కరోనా నిర్ధారణ పరీక్షలు మరింత తీవ్రతరం కానున్నాయి. దక్షిణ కొరియా నుంచి ఆదివారం 1.50 లక్ష కిట్స్ రాష్ట్రానికి వచ్చాయి. ఈ సంఖ్యతో ప్రస్తుతం చేతిలో ఐదు లక్షలకు పైగా కిట్స్ ఉన్నట్టు, మరో ఆరు లక్షల కిట్స్ కొనుగోలుకు చర్యలు చేపట్టినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక, ఆదివారం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య వెయ్యి దాటింది. 13 మంది మరణించారు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఈ సంఖ్య చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోనే మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈపరిస్థితుల్లో తిరువణ్ణామలైలో ఆదివారం ఒక్క రోజే 54 కేసులు నమోదయ్యాయి. ఇవి చెన్నై నుంచి అక్కడికి వెళ్లిన వారు కావడం గమనార్హం. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలోని 43, ప్రైవేటుపరంగా ఉన్న 29 అంటూ, మొత్తంగా 72 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరిశోధనలు సాగుతున్నాయి. రోజుకు కనీసం 10 వేల మేరకు పరిశోధనలు జరుగుతున్నాయి. రోజూవారిగా పరిశోధన వివరాలు, పాజిటివ్ కేసుల సంఖ్యను ప్రతిరోజూ సాయంత్రం ఆరోగ్య శాఖ ప్రకటిస్తూ వస్తున్నది. ఈనెల 25 నుంచి కేసులు అమాంతంగా పెరిగాయి. 27వ తేదీ 817, 28వ తేదీన 827, 29వ తేదీ 874, 30వ తేదీ 938 కేసులు నమోదు కావడంతో ఆందోళన పెరిగింది. ఆదివారం రికార్డు స్థాయిలో 1,149 కేసులు నమోదయ్యాయి. రెండో సారిగా 13 మరణాలు ఒకే రోజు చోటు చేసుకోవడం కలవరం రేపుతోంది. అయితే, ఈ పరిశోధనలు మరి తక్కువగా ఉందని, మరింత తీవ్రతరం చేయాలని వైద్య నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ పరీక్షలు మరింత ముమ్మరం చేసిన పక్షంలో కేసులు అమాంతంగా పెరిగే అవకాశాలు ఎక్కువే.(తమిళనాడులో రోడ్డెక్కనున్న బస్సులు)
18 వేల మందికి లక్ష్యంగా..
రాష్ట్రంలో ఆదివారం నాటికి 4,91,962 పీసీఆర్ కిట్స్ ద్వారా 4,68 940 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఇది వరకు రోజుకు పది వేల మేరకు జరగ్గా, ఆదివారం నుంచి పరీక్షల సంఖ్య పెంచారు. దీనికి తోడుగా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత తీవ్రం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటా పరిశోధనలు ముమ్మరం కానున్నాయి. రోజుకు కనీసం 18 నుంచి 20 వేల పరిశోధనలు సాగించడం లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. ఇందుకు తగ్గట్టుగా పీసీఆర్ కిట్స్‌ను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఆదివారం దక్షిణ కొరియా నుంచి 1.50 లక్షల మేరకు పీసీఆర్ కిట్స్ రాష్ట్రానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 5.20 లక్షల మేరకు పీసీఆర్ కిట్లు చేతిలో ఉండడంతో పరిశోధనల తీవ్రతరం దిశగా అడుగుల వేగాన్ని పెంచేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది. (నిర్లక్ష్యం వద్దు.. యుద్ధం ముగియలేదు)
మరో ఆరు లక్షల కిట్స్‌ను ఇతర దేశాల్లోని సంస్థలకు ఆర్డర్ ఇచ్చారు. దీంతో వారానికి 1.50 లక్షలు చొప్పున కిట్స్ ఇక్కడికి రానున్నాయి. ఈ దృష్ట్యా, జూన్‌లో రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా నిర్వహించేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. చెన్నై నుంచి బయటకు వెళ్లే వాళ్లు, చెన్నైలోకి వచ్చే వాళ్లకు వైరస్ నిర్ధారణ తప్పనిసరి చేశారు. అయితే, చెన్నైకు ఉద్యోగ, వివిధ అత్యవసర పనుల రీత్యా పక్క జిల్లాల నుంచి వచ్చి 48 గంటల్లో తిరుగు పయనం అయ్యే వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చారు. ఇక, చెన్నైలో ఉండి ఇతర జోన్లకు వెళ్ల దలచిన వారికి పరీక్ష తప్పనిసరి చేశారు. నిర్ధారణ కాని పక్షంలో వారం రోజులు స్వీయ నిర్భంధంలో ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అలాగే, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రల నుంచి ఇక్కడకు వచ్చే వాళ్లకు పరీక్షలు తప్పనిసరి చేసి ఉన్నారు. నిర్ధారణ కాని పక్షంలో 14 రోజుల స్వీయ నిర్బంధం తప్పనిసరి చేశారు. ఇక, కేంద్ర ఆరోగ్య పరిశోధన సంస్థ ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది, నర్సులు, డాక్టర్లకు సైతం నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయనున్నారు.
గర్భిణుల కోసం..
చెన్నైలో గర్భిణులు, పుట్టే బిడ్డ కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. పెరుగుతున్న ఈ కేసులను పరిగణనలోకి తీసుకుని గర్భిణులు, చంటి బిడ్డ తల్లుల కోసం ప్రత్యేక వార్డుల రూపకల్పన మీద ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. 110 పడకలతో తిరువొత్తియూరు, షోళింగనల్లూరు, రామయపురం పరిసరాల్లో ప్రత్యేక క్వారంటైన్‌తో పాటు వైద్య సేవల నిమిత్తం ఏర్పాట్లు చేపట్టారు. గర్భిణి మహిళలకు సైతం కరోనా నిర్ధారణ పరీక్షలు వేగవంతం కానుంది.
మరణంలోనూ..
కరోనా కేసుల సంఖ్యకు తోడుగా రోజు రోజుకు మరణాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విరుగంబాక్కంలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించకుండానే ఓ మహిళ హఠాన్మరణం పొందడం కలకలం రేపింది. ఆమె మరణించిన సమాచారంతో తండ్రి కూడా మృతి చెందడం విషాదంలోకి నెట్టింది. విరుగంబాక్కం ఇళంగోనగర్‌కు చెందిన త్యాగరాజ్(84) కుమార్తె (54) శనివారం ఇంట్లో కింద పడి శ్వాస ఆడక మరణించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా మరణంగా తేల్చారు. ఈ సమాచారంతో అర్ధరాత్రి వేళ త్యాగరాజ్ సైతం స్పృహ తప్పాడు. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మరణించాడు. ఆయనకు కరోనా ఉందా అని నిర్ధారించేందుకు పరీక్షలు చేశారు. అయితే, ఎలాంటి లక్షణాలు అన్నది కనిపించకుండానే మరణం చోటు చేసుకోవడం కలవరాన్ని రేపుతోంది.
ఇక డిశ్చార్జ్‌కు రూ.వెయ్యి:సీఎం పళనిస్వామి
సాక్షి, చెన్నై: చెన్నైలో కరోనా తాండవం చేస్తున్నది. ఈ నగరానికి శివార్లలో ఉన్న చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు సైతం కరోనా కష్టాలు తప్పలేదు. నగరంలోని 15 మండలాల్లో ఆరు మండలాలు కేసుల సంఖ్యా పరంగా రేసులో దూసుకెళ్తున్నాయి. ఇందులో రాయపురం, తండయార్‌పేట, తిరువికానగర్ మండలాల్లో పెరుగుతున్న సంఖ్య ఆందోళనకు గురి చేస్తున్నది. ఉత్తర చెన్నై పరిధిలోని ఈ మూడు మండలాలు ఉన్నాయి. ఇక్కడ విధుల్ని నిర్వర్తిస్తున్న పోలీసులు, ఆరోగ్య సిబ్బంది సైతం వైరస్ బారిన పడాల్సిన పరిస్థితి. ఇరుకు సంధులు, మురికి వాడలు, గాలి, వెలుతురు కూడా లేని రీతిలో చిన్న చిన్న గదుల్లో నివాసాలు అంటూ ఇక్కడ జీవన విధానం కష్టతరంగానే ఉంటుంది. ఇక్కడ కరోనా పరీక్షలు, కేసుల గుర్తింపు అన్నది ఆరోగ్య సిబ్బందికి పెను సవాలుగా మారింది. అలాగే, ఇక్కడ జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నా, ఆస్పత్రులకు వెళ్లకుండా దాక్కుని తిరిగే వాళ్లూ ఎక్కువే. ఇందుకు కారణం ఇక్కడ అనేక కుటుంబాల బతుకు జీవనం అన్నది రోజూవారి కూలి మీద ఆధారపడి ఉంది.
పరీక్షల చేయించుకుంటే, కరోనా పేరిట ఎక్కడ క్వారంటైన్లలో పడేస్తారో, ఆస్పత్రులకు తరలిస్తారో అన్న ఆందోళన ఎక్కువే. ఈ పరిస్థితుల్లో కరోనా బారినపడి క్వారంటైన్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొంది బయటకు వచ్చే సమయంలో ఇక్కడి పేదలకు రూ. వెయ్యి చొప్పున నగదు పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులను సీఎం పళనిస్వామి జారీ చేశారు. నగరంలోని మురికి వాడలు, గుడిసె ప్రాంత వాసులు, ఇరుకు సంధుల్లో, చిన్న గదుల్లో నివాసం ఉన్న పేదలు ఎవరైనా కరోనా బారిన పడి క్వారంటైన్లలో, ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పక్షంలో, వారు డిశ్చార్జ్ అయ్యే సమయంలో రూ. వెయ్యి నగదు పంపిణీ చేయనున్నామని ప్రకటించారు. అస్సలే రోజూవారి కూలీల మీద ఆధార పడే వాళ్లు, డిశ్చార్జ్ కాగానే, పనులకు వెళ్లడం కష్టతరంగా ఉంటుందని, అందుకే బతుకు జీవనం కోసం వారికి రూ. వెయ్యి అందజేయనున్నట్టు సీఎం ప్రకటించారు.
నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఈసందర్భంగా సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే, చెన్నై కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నా, అలుపెరగకుండా పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను సీఎం గుర్తించారు. వారికి తన అభినందనలు తెలియజేయడమే కాదు, ఒక్కో పారిశుధ్య కార్మికుడికి గౌరవ వేతనంగా రూ. 2500 పంపిణీ చేయడానికి నిర్ణయించారు. చెన్నై కార్పొరేషన్ పరిధితో పాటు నగరం పరిధిలో ఉన్న తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు చెందిన పారిశుధ్య కార్మికులు 33 వేల మందికి ఈ గౌరవ వేతానాన్ని ప్రత్యేకంగా అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment