ఢిల్లీలోని శాస్త్రీనగర్‌లో ఓ బ్యాంకు ఎదుట భౌతిక దూరం పాటించని ప్రజలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి కేవలం కేవలం ఒక్కరోజులో 32 మంది కన్నుమూశారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 485 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. దేశంలో కరోనా వల్ల ఇప్పటిదాకా 149 మరణాలు సంభవించాయని, మొత్తం పాజిటివ్ కేసులు 5,274కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కేసుల తీవ్రత నానాటికీ పెరుగుతుండడంతో కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం అదేస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులకు కరోనా సోకకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
కరోనా బాధితులను కలిసిన వారందరినీ గుర్తించాలని, తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించిందన్నారు. దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధ నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. కరోనాపై విజయం సాధించాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని చెప్పారు. ఇప్పటిదాకా 1,21,271 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)లో ఎడిడెమోలజీ విభాగం అధిపతి రామన్ ఆర్ గంగాఖేడ్కర్ చెప్పారు. ఇందులో 13,345 పరీక్షలు మంగళవారం నిర్వహించామన్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో 139 ల్యాబ్‌లు పని చేస్తున్నాయని అన్నారు. అలాగే 65 ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు.
కరోనా కట్టడికి కొత్త ఉద్యోగులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనాపై పోరాటంలో భాగంగా వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కొంత విశ్రాంతి కల్పిస్తూ వారి స్థానంలో భారీ స్థాయిలో కొత్త ఉద్యోగులను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులకు వైద్య సేవలందించేందుకు, వైరస్ నియంత్రణ చర్యలు అమలు చేసేందుకు ఈ కొత్త ఉద్యోగులను నియమిస్తారు. ఈ ఉద్యోగులకు అవసరమైన శిక్షణను ఆన్‌లైన్ ద్వారా ఇస్తారు. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ట్రైనింగ్(ఐజీవోటీ) అనే వేదికను సిద్ధం చేశారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, సాంకేతిక నిపుణులు, ఏఎన్‌ఎంలు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పౌర రక్షణ సిబ్బందికి ఈ ఆన్‌లైన్ శిక్షణ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment