
న్యూఢిల్లీ: కేవలం ఒక్క నెల.. 30 రోజులు.. 3,94,958 మంది బాధితులు. దేశంలో జూన్ నెలలో కరోనా ఉధృతికి నిదర్శనం ఈ గణాంకాలు. నెల రోజుల్లోనే దాదాపు 4 లక్షల మంది కరోనా మహమ్మారి బారిన పడడం గమనార్హం. రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. భారత్‌లో మంగళవారం నుంచి బుధవారం వరకు 24 గంటల్లో కొత్తగా 18,653 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 507 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.
దేశంలో వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాక ఒక్కరోజులో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. అంటే గంటకు 21 మంది చొప్పున మృత్యువాత పడినట్లు స్పష్టమవుతోంది. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 5,85,493కి, మరణాలు 17,400కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 2,20,114 కాగా, 3,47,978 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 59.43 శాతానికి పెరిగినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 88,26,585 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ బుధవారం తెలియజేసింది.