ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచమంతా విలవిల్లాడుతున్న సమయంలో సానుకూల పరిణామం చోటు చేసుకుంది. కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారి సంఖ్య మిలియన్ మార్క్ దాటింది. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిన్నర లక్షల(10,48,724) మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఊరట కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన జాగ్రత్తలు పాటిస్తూ, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకుంటే కరోనా మహమ్మారిని తరిమికొట్టడం కష్టమేమి కాదని దీని ద్వారా రుజువుతోంది. దృఢ సంకల్పం, చిత్తశుద్ధి, కొన్ని జాగ్రత్తలతో వైరస్‌ను ఎదుర్కొవచ్చని కోవిడ్ నుంచి కోలుకున్న ఈ 10 లక్షల మంది ప్రపంచానికి వెల్లడించారు.
అంతర్జాతీయంగా ఇప్పటివరకు మొత్తం 33 లక్షల మందిపైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. కోవిడ్-19 సోకిన వారిలో 2 లక్షల 34 వేల మంది ఇప్పటివరకు మృతి చెందారు. అయితే వైరస్‌ను తట్టుకునే శక్తి మనుషుల్లో రోజు రోజుకు పెరుగుతుండటం, మరణాల రేటు కాస్త తగ్గుముఖం పట్టడం వంటి సానకూల పరిణామాలు కరోనాపై పోరులో ఆశాకిరణాలుగా కన్పిస్తున్నాయి. మన దేశంలో కొవిడ్-19 బారిన పడి కోలుకుంటున్నవారి సగటు గురువారం నాటికి 25.19 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా కరోనా కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య కేవలం 3.2 శాతం మాత్రమేనని తెలిపింది. వైరస్ దాడిని తట్టుకునే రేటు క్రమంగా పెరుగుతున్నట్టు దీన్ని బట్టి అర్థం అవుతోంది. అయితే లాక్‌డౌన్ ఉపసంహరించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. (ప్రత్యేక రైళ్లు వేయండి: సుశీల్ మోదీ)
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 35,043కి పెరిగింది. ఇప్పటివరకు 8,889 మంది కోవిడ్-19 నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1147 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 25,007 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 10,498 కరోనా కేసులు నమోదు కాగా, 459 మంది చనిపోయారు. (కరోనా కాలం: బిలియనీర్ల విలాస జీవనం)
Comments
Please login to add a commentAdd a comment