* మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌కు హైకోర్టులో ఊరట
* యూపీలో బీఎస్పీ మద్దతుపై ఉత్కంఠ
భోపాల్/జైపూర్/లక్నో: పలు రాష్ట్రాల్లో ఈనెల 11న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటేసేందుకు రాష్ట్ర హైకోర్టు అడ్డంకులు తొలగిస్తూ గురువారం తీర్పునిచ్చింది. ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రతిపక్ష నేత సత్యదేవ్ కటారేకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించాలంటూ ఈసీని జబల్‌పూర్ బెంచ్ ఆదేశించింది. అలాగే అత్యాచారం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మరో ఎమ్మెల్యే రమేష్ పటేల్‌కు ఇండోర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 57 మంది ఎమ్మెల్యేలుండగా ఒక్కరు తక్కువైనా రాజ్యసభ సీటును వదులుకోవాల్సిందే.
యూపీలో మాయావతి మొగ్గు ఎటు?
ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీకి 80 మంది ఎమ్మెల్యేలుండగా ఇద్దర్ని గెలిపించుకునే బలం ఉంది. ఒక్కో అభ్యర్థికి మొదటి ప్రాధాన్య ఓట్లు 34 వస్తే ఎంపీగా గెలవొచ్చు. ఈ లెక్కన బీఎస్పీ మరో 12 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేశారో ఫలితాలు వెలువడ్డాకే తెలుస్తుందని మాయావతి చెప్పారు. రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లకు మద్దతిస్తారని ఆ పార్టీ వెల్లడించింది.
ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ ఏడుగుర్ని బరిలో నిలపగా, ఏడో అభ్యర్థికి మొదటి ప్రాధాన్య ఓట్లలో 9 మంది ఎమ్మెల్యేల కొరత ఉంది. కాంగ్రెస్‌కు 29 మంది ఎమ్మెల్యేలుండగా అభ్యర్థిని గెలిపించుకోవాలంటే మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలుండడంతో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయం.
రాజస్తాన్‌లో బీజేపీ శిబిరంలోకి: రాజస్థాన్‌లో నేషనల్ యూనియనిస్టు జమిందార్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరంలో చేరారు. ఎమ్మెల్యేలు కామిని జిందాల్, సోనా దేవీ బవ్రీలు బీజేపీకి మద్దతిస్తున్నారని సీఎం కార్యాలయం తెలిపింది. కాగా, కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు రావడంతో వాయిదా వేస్తారని భావించినా... షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహిస్తామని ఈసీ గురువారం ప్రకటించింది.
రసవత్తరంగా రాజ్యసభ పోరు
Published Fri, Jun 10 2016 3:02 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement