![covid19 TN man in home quarantine runs out naked bites old woman to death - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/28/covid-19.jpg.webp?itok=kpTQEDhF)
సాక్షి, చెన్నై : కోవిడ్-19 (కరోనా వైరస్) నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. హోం క్వారంటైన్ లో ఉన్న ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించిన వైనం కలకలం రేపింది. విదేశాలనుంచి ఇటీవల తిరిగి వచ్చిన వ్యక్తి (34) ని పోలీసులు క్వారంటైన్ లో వుంచారు. అయితే ఏమైందో ఏమో తెలియదుగానీ, క్వారంటైన్ నుంచి బయటికి నగ్నంగా పరుగులు పెట్టాడు. అంతేకాదు వృద్ధురాలు (90) మరణానికి కారకుడయ్యాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం శ్రీలకం నుంచి తమిళనాడులోని థేని జిల్లాకు వచ్చిన వ్యక్తిని ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్ లో ఉంచారు అధికారులు. అయితే శుక్రవారం రాత్రి నిర్బంధంలోంచి నగ్నంగా బయటికి వచ్చిన అతగాడు ఆరు బయట నిద్రిస్తున్న వృద్దురాలిపై దాడి చేసి, ఆమె గొంతు కొరికాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే వృద్దురాలిని ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది. థేని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దీంతో ఈ ప్రాంతంలో ఆందోళన చెలరేగింది. అయితే గతవారం విదేశాలనుంచి తిరిగి వచ్చిన అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment