ఆవూ.. పరీక్ష రాస్తుందోచ్!
శ్రీనగర్: అవును. ఈ ఆవు పాలు ఇవ్వడమే కాదు.. పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశ పరీక్ష కూడా రాయబోతోంది! నమ్మశక్యంగా లేదా? అయితే.. అన్ని వివరాలనూ క్షుణ్ణంగా పరిశీలించి మరీ జమ్మూకశ్మీర్ ‘బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(బీవోపీఈఈ)’ జారీ చేసిన ఈ హాల్‌టికెట్ చూడండి. కచిర్ గావ్(గోధుమ రంగు ఆవు).. డాటర్ ఆఫ్ గూరా దండ్(ఎర్ర ఎద్దు).. వయసు 18 ఏళ్లు అంటూ పూర్తి వివరాలున్నాయి. సంతకం, వేలిముద్రల బాక్సుల్లో తోక, గిట్ట ఫొటోలూ ఉన్నాయి! ఉదయం 9:55 గంటలు దాటితే ప్రవేశం లేదనీ స్పష్టంచేశారు. మే 10న జరిగే పరీక్ష రాసేందుకు ఈ హాల్‌టికెట్ జారీ అయింది! కశ్మీర్ ప్రతిపక్ష పార్టీ నేత జునైద్ అజీమ్ మట్టూ హాల్‌టికెట్ కాపీని ట్విటర్‌లో పెట్టడంతో ఈ గోవు-పరీక్ష సంగతి వెలుగుచూసింది.
విద్యామంత్రి నయీం అక్తర్ హయాంలో మంచి ప్రగతి కనిపిస్తోందని, ఆవులూ హాల్‌టికెట్లు పొందగలుగుతున్నాయంటూ మట్టూ ట్వీట్ చేశారు. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఆవు పరీక్ష బాగా రాస్తుందో లేదో చూడాలని ఉందన్నారు. చివరకు ఈ వార్త అధికారుల దాకా పాకడంతో వారు నాలుక్కర్చుకుని శనివారం ఉదయం హాల్‌టికెట్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించారు. దరఖాస్తులు, హాల్‌టికెట్ల జారీ ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరగడం వల్ల పొరపాటు చోటుచేసుకుందని బోర్డు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఫరూక్ అహ్మద్ మీర్ వివరణనిచ్చారు. మనిషి బొమ్మకు, జంతువుల బొమ్మకు తేడాను సాఫ్ట్‌వేర్ గుర్తించలేకపోవడం వల్ల పొరపాటు జరిగిందన్నారు. ఎవరో ఆకతాయిలు ఆవు ఫొటోను అప్‌లోడ్ చేసి ఈ కొంటె పనిచేశారని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.