సాక్షి, చెన్నై: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచాపై విధించిన నిషేధం శివకాశిపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. బాణసంచా విక్రయాల్లో దేశంలోనే అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఢిల్లీలో నిషేధం అమల్లోకి రావడంతో శివకాశి బాణసంచా తయారీదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రూ. 1000 కోట్ల విలువైన సుమారు 50 లక్షల కేజీల బాణసంచా సామగ్రిని గోదాములకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వెలుగులు చిమ్మే దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టం. బాణసంచా కాల్చడం మరెంతో ఆనందం. దీపావళిని పురస్కరించుకుని తమిళనాడు విరుదునగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బాణసంచా మార్కెట్లోకి తరలుతుంటాయి. బాణసంచా తయారీకి పెట్టింది పేరుగా , కుట్టి జపాన్‌గా విరుదునగర్ జిల్లాలోని శివకాశి ప్రసిద్ది చెందింది. ఇక్కడ దీపావళిని పురస్కరించుకుని ఏటా రూ.5 వేల కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. కొన్నేళ్లుగా ఇక్కడి ఉత్పత్తిదారులకు షాక్‌ల మీద షాక్‌లు తప్పడం లేదు. ఓ వైపు ప్రమాదాల భయం వెంటాడుతుంటే, మరోవైపు చైనా రూపంలో కష్టాలు తప్పడం లేదు. చాప కింద నీరులా చైనా పటాకులు దిగుమతి అవుతోండటం గగ్గోలు రేపుతోంది. చైనా ఉత్పత్తులను నిషేధించాలని శివకాశి బాణాసంచా తయారీదారులు నినదిస్తూ వస్తున్నారు. అయినా ఫలితం శూన్యం. తాజాగా దీపావళి పర్వదినం సమీపిస్తుండటంతో ఏడాది పొడవునా శ్రమించి ఉత్పత్తి చేసిన బాణసంచాను మార్కెట్లోకి తరలించేందుకు ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి.
ఆన్‌లైన్ ద్వారా కూడా బాణసంచా విక్రయాలకు అనేక వర్తక సంస్థలు సిద్ధం అవుతున్నాయి. ఏటా ఏదో ఒక రూపంలో కష్టాలు, నష్టాలు ఎదురు అవుతున్న నేపథ్యంలో ఈసారి కూడా తాము ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందోనన్న ఆందోళన విరుదునగర్ జిల్లా బాణసంచా తయారీదారుల్లో ఉంది. ప్రమాదాలకు ఆస్కారం లేని రీతిలో గట్టి భద్రతా చర్యలు చేపట్టి ఉన్నా, మరో వైపు వర్షం రూపంలో తమ వ్యాపారం దెబ్బ తింటుందేమోనన్న బెంగ పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రూపంలో ఉత్పత్తిదారుల నెత్తిన పిడుగు వచ్చి పడిందని చెప్పవచ్చు.
ఢిల్లీ దెబ్బ ...శివకాశికి షాక్
దేశంలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో ముంబై, ఢిల్లీ వంటి నగరాలలో బాణా సంచాల విక్రయాలు అత్యధికంగా సాగుతున్నాయి. శివకాశి నుంచే ఉత్తరాది నగరాలకు బాణా సంచాలను తరలిస్తున్నారు. ఈ సమయంలో ఢిల్లీలో బాణాసంచా అమ్మకంపై నిషేధం అమల్లోకి రావడం శివకాశి ఉత్పత్తిదారుల నెత్తిన పిడుగు పడ్డట్లయింది. వాయు కాలుష్య ప్రభావం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో బాణాసంచాల విక్రయాలపై నిషేధం పడింది. దీంతో శివకాశి నుంచి తరలించాల్సిన బాణా సంచాలు గోడౌన్లకు పరిమితం చేయాల్సిన పరిస్థితి. శివకాశికి చెందిన పరిశ్రమలు ఢిల్లీలో బాణాసంచాల విక్రయాలకు ప్రత్యేక లైసెన్స్‌లను పొంది ఉన్నాయి. ఆ మేరకు 450 వరకు ఓపెన్ టైప్ లైసెన్స్‌లు, వెయ్యి వరకు చిన్న చిన్న దుకాణాల ఏర్పాటుకు తగ్గ లైసెన్స్‌లు కల్గి ఉండగా, ప్రస్తుతం అవన్నీ రద్దు కానుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం విక్రయంలో 20 నుంచి 25 శాతం మేరకు విక్రయాలు ఢిల్లీలో సాగుతాయని, ఈ నిషేధంతో 50 లక్షల కేజీల మేరకు బాణాసంచా గోడౌన్‌కు పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న సరకును బయటకు పంపించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఏమి చేయాలో తోచడం లేదని పరిశ్రమల యజమానులు అంటున్నారు. నిషేధం కారణంగా రూ. వెయ్యి కోట్ల మేరకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం ఇతర ప్రాంతాలకు బాణసంచా రవాణాపై సైతం ప్రభావాన్ని చూపుతుందని, నిషేధం ఉత్తర్వులను సుప్రీంకోర్టు పునర్ పరిశీలించాలని పరిశ్రమల యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment