సాక్షి, న్యూఢిల్లీ: కాలుష్యరహితంగా దీపావళి పండుగ జరుపుకోవాలన్న దేశ రాజధాని ఢిల్లీ ఆశలు అడియాసలయ్యాయి. పటాకుల అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించినా.. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో కాలుష్య పోటు తప్పలేదు. ఎప్పటిలాగే హస్తినవాసులు ఘనంగా దీపావళి పండుగ జరుపుకున్నారు. టపాసుల మోత మోగించారు. సుప్రీంకోర్టు నిషేధ ప్రభావం పెద్దగా కనిపించలేదు. దీంతో కాలుష్యం పెరిగిపోయి.. వాతావరణంలో దట్టమైన పొగ అలుముకోవడం ఢిల్లీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర రెడ్‌జోన్‌కు చేరినట్టు కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల్లోని ఆన్‌లైన్ ఇండికేటర్స్ వెల్లడించాయి. ఢిల్లీలో వాయు నాణ్యత కూడా గణనీయంగా పడిపోయింది. రాత్రి ఏడు గంటల నుంచే అల్ట్రాఫైన్ పార్టిక్యూలేట్స్ ప్రమాదకరస్థాయికి పెరిగిపోయాయి. పీఎం2.5, పీఎం 10 స్థాయికి పెరిగిపోయిన ఈ కాలుష్య కణాలు మనిషి శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించి.. అనంతరం రక్తప్రవాహంలో కలిసి ఆరోగ్యానికి తీవ్ర చేటు కలిగిస్తాయి.
ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరిందని పొల్యూషన్ డాటా స్పష్టం చేస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో క్యూబిక్ మీటర్‌కు గాలిలో పీఎం2.5, పీఎం 10 మరియు 878, 1,179 మైక్రోగ్రామ్స్ కాలుష్య కణాలు నమోదయ్యాయని ఆర్కేపురం వాతావరణ కేంద్రం తెలిపింది. తాజాగా ఢిల్లీలో కాలుష్యం దాదాపు పదిరెట్లు పెరిగిపోయిందని భావిస్తున్నారు.
సాయంత్రం ఆరు గంటల వరకు ఢిల్లీలో సుప్రీంకోర్టు నిషేధ ప్రభావం కనిపించిందని, అప్పటివరకు పెద్దగా టపాసుల మోత మోగలేదని ఢిల్లీ వాసులు తెలిపారు. అయితే, రాత్రి ఏడు గంటల నుంచి పండుగ ప్రభావం కనిపించింది. ఎప్పటిలాగే పటాకుల మోత మోగింది. దీనికితోడు ఎలాంటి నిషేధంలేని ఢిల్లీ శివారు ప్రాంతలైన గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్‌లలో ఘనంగా దీపావళి పండుగ జరగడం కూడా ప్రభావం చూపిందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment