ban on crackers
-
దట్టమైన పొగ.. ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి!
సాక్షి, న్యూఢిల్లీ: కాలుష్యరహితంగా దీపావళి పండుగ జరుపుకోవాలన్న దేశ రాజధాని ఢిల్లీ ఆశలు అడియాసలయ్యాయి. పటాకుల అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించినా.. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో కాలుష్య పోటు తప్పలేదు. ఎప్పటిలాగే హస్తినవాసులు ఘనంగా దీపావళి పండుగ జరుపుకున్నారు. టపాసుల మోత మోగించారు. సుప్రీంకోర్టు నిషేధ ప్రభావం పెద్దగా కనిపించలేదు. దీంతో కాలుష్యం పెరిగిపోయి.. వాతావరణంలో దట్టమైన పొగ అలుముకోవడం ఢిల్లీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర రెడ్‌జోన్‌కు చేరినట్టు కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల్లోని ఆన్లైన్ ఇండికేటర్స్ వెల్లడించాయి. ఢిల్లీలో వాయు నాణ్యత కూడా గణనీయంగా పడిపోయింది. రాత్రి ఏడు గంటల నుంచే అల్ట్రాఫైన్ పార్టిక్యూలేట్స్ ప్రమాదకరస్థాయికి పెరిగిపోయాయి. పీఎం2.5, పీఎం 10 స్థాయికి పెరిగిపోయిన ఈ కాలుష్య కణాలు మనిషి శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించి.. అనంతరం రక్తప్రవాహంలో కలిసి ఆరోగ్యానికి తీవ్ర చేటు కలిగిస్తాయి. ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరిందని పొల్యూషన్ డాటా స్పష్టం చేస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో క్యూబిక్ మీటర్‌కు గాలిలో పీఎం2.5, పీఎం 10 మరియు 878, 1,179 మైక్రోగ్రామ్స్ కాలుష్య కణాలు నమోదయ్యాయని ఆర్కేపురం వాతావరణ కేంద్రం తెలిపింది. తాజాగా ఢిల్లీలో కాలుష్యం దాదాపు పదిరెట్లు పెరిగిపోయిందని భావిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఢిల్లీలో సుప్రీంకోర్టు నిషేధ ప్రభావం కనిపించిందని, అప్పటివరకు పెద్దగా టపాసుల మోత మోగలేదని ఢిల్లీ వాసులు తెలిపారు. అయితే, రాత్రి ఏడు గంటల నుంచి పండుగ ప్రభావం కనిపించింది. ఎప్పటిలాగే పటాకుల మోత మోగింది. దీనికితోడు ఎలాంటి నిషేధంలేని ఢిల్లీ శివారు ప్రాంతలైన గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్‌లలో ఘనంగా దీపావళి పండుగ జరగడం కూడా ప్రభావం చూపిందని అంటున్నారు. -
టపాసులు కాల్చడం ఎక్కడి సంప్రదాయం?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో సాధారణ రోజుల్లోనే కాలుష్యం ఎక్కువ. ఇక దసరా పండుగ నుంచి దీపావళి పండుగ వరకు నగరాన్ని ఆవహించే కాలుష్యం గురించి చెప్పనక్కరే లేదు. అందుకనే దీపావళి పండుగ సందర్భంగా నగరంలో బాణాసంచా అమ్మకాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. అలాగే ప్రజలు కూడా బాణాసంచా కాల్చకూడదంటూ నిషేధం విధించాలంటూ వచ్చిన విజ్ఞప్తులను త్రోసిపుచ్చింది. ప్రజల ఇష్టాయిష్టాలను తాము నిర్దేశించలేమని, పైగా బాణాసంచాను కాల్చడం తమ సంప్రదాయం, మతాచారం అంటూ వాదించే అవకాశం ఉందని కూడా కోర్టు అభిప్రాయపడింది. కోర్టు అభిప్రాయం నిజమేనా? దీపావళి పండుగ సందర్భంగా టాపాసులు కాల్చడం భారతీయ హిందూ సంప్రదాయమా? అసలు ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి కొనసాగుతోంది? టపాసులు కాల్చే అలవాటు దీపావళి పండగ నుంచే వచ్చిందా? అంతకుముందు నుంచే ఉందా? అసలు టపాసులు ఎక్కడ పుట్టాయి, దేశానికి ఎప్పుడు వచ్చాయి? రామాయణ కాలం గడిచిపోయిన కొన్ని దశాబ్దాలకు, అంటే క్రీస్తు శకం పదవ శతాబ్దంలోనే టపాసులకు మూల పదార్థమైన ‘గన్ పౌడర్’ను చైనీయులు కనుగొన్నారు. ఆ తర్వాత దాదాపు నాలుగు వందల సంవత్సరాల తర్వాత అవి మనదేశంలోకి ప్రవేశించాయి. దీపావళి అంటే దీపాల పండుగే ‘దీపావళి పండుగంటే నిజంగా దీపాల పండుగే. భారత దేశంలో దీపావళి పండుగ మొదలైన రోజుల్లో టపాసులు కాల్చే అలవాటు లేదు. దీపావళి వెలిగించడమే ఉండేది. ఆ తర్వాత ఎప్పటికో దీపావళి రోజున టపాసులు కాల్చడం మొదలైంది’ అని బనారస్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, వారణాసిలో ఆలయ పూజారిగా కొనసాగుతున్న విశ్వాంబర నాథ్ మిశ్రా తెలిపారు. ప్రాచీన పుస్తకాల్లో ఉన్న ప్రస్తావనల ప్రకారం టాపాసులు భారత్‌కు క్రీస్తు శకం 1400 సంవత్సరంలో వచ్చాయి. ఇక దీపావళి పండుగ సందర్భంగా వీటిని కాల్చే అలవాటు 1700 సంవత్సరంలో మొదలైంది. చింతామణిలోనే బాంబుల తయారీ ఒరిస్సాకు చెందిన గజపతి ప్రతాపరుద్రదేవ రచించిన ‘కౌటుక చింతామణి’ పుస్తకంలో ఈ టపాసులను ఎలా తయారో చేయాలో ప్రస్తావన ఉందని, ఆయన ఆ పుస్తకాన్ని 1497 నుంచి 1939 సంవత్సరాల మధ్య రాసి ఉంటారని ప్రముఖ విద్యావేత్త పీకే గోడే తన ‘ఏ హిస్టరీ ఆప్ ఫైర్ వర్క్స్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో వెల్లడించారు. ఈ హిస్టరీ పుస్తకం 1953లో ప్రచురితమైంది. ‘గంధకం, బొగ్గు, పొటాషియం నైట్రేట్, పాదరసం, ఆవు మూత్రం మిశ్రమాన్ని గుజ్జు తీసిన వెదురు బొంగులో కూరడం ద్వారా టపాసులను తయారు చేయాలి’ అని గజపతి తన పుస్తకంలో పేర్కొన్నారు. అంతకుముందే, అంటే 1421 నుంచి 1472 మధ్య కశ్మీర్‌ను పాలించిన రాజు జైన్ ఉల్ అబిదిన్ 1466లో టపాసులను తయారు చేయించారని ఓ పర్శియన్ గ్రంధం తెలియజేస్తోంది. 1500 దశకంలో గుజరాత్‌కు చెందిన బ్రాహ్మణ కుటుంబాల్లో పెళ్లిళ్లకు బాణాసంచా పేల్చేవారని 1518లో భారత్‌ను సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ద్వార్తే బర్బోసా తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. బాంబులు, రాకెట్లు కాల్చి పెళ్లిళ్లను ఘనంగా జరిపేవారని ఆయన వివరించారు. 1700 సంవత్సరంలోనే.... ఇక పెషావుల కాలంలో, అంటే క్రీస్తు శకం 1700 కాలంలో దీపావళి పండుగ సందర్భంగా టాపాసులను కాల్చే అలవాటు వచ్చిందని, అప్పుడు వాటిని ‘దారుచి లంక’ అని పిలిచేవారని, అంటే బాణాసంచా కలిగిన లంక అని అర్థమని విద్యావేత్త పీకే గోడే తన పుస్తకంలో వెల్లడించారు. పండుగలు, పబ్బాల సందర్భంగా టపాసులు కాల్చడం గత రెండు, మూడు ఏళ్లుగా కాస్త తగ్గినప్పటికీ 40 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈ అలవాటు ఎప్పుడు, ఎలా వచ్చినా ఇప్పుడు టపాసులను కాల్చడం తమ సంప్రదాయం, తమ సంస్కృతని వాదిస్తున్నవాళ్లు, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వాళ్లు ఉన్నారు. వాతావరణంలో కాలుష్యం పెరగడానికి ఒక్క టపాసులే కారణం కాదుకనుక విజ్ఞులైన ప్రజలు భవిష్యత్ తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల కాలుష్యాన్ని నిరోధించేందుకు తమవంతు కృషి చేయాలి. -
టపాసుల నిషేధం
దీపావళి పండగ సమీపిస్తున్నదంటే పిల్లల సందడి ఎక్కువుంటుంది. పెద్దలు కూడా పిల్లల్లా మారి హడావుడి చేసే పండగ అది. గత కొన్నేళ్లుగా సరిగ్గా ఈ సమ యంలోనే వాతావరణ కాలుష్యం ప్రముఖంగా చర్చకొస్తున్నది. ఈ దఫా కూడా అది మొదలైంది. వరసగా రెండో ఏడాది కూడా సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లోనూ, దాని శివార్లలోనూ 20 రోజులపాటు టపాసుల విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. టపా సుల విక్రేతలకు జారీచేసిన తాత్కాలిక లైసెన్స్‌లను సైతం రద్దు చేసింది. నవంబర్ 1 తర్వాతే వీటిని ఎత్తేస్తామని స్పష్టం చేసింది. నిరుడు ఈ తరహాలోనే ఇచ్చిన ఆదే శాలను గత నెల 12న ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సవరించింది. టపాసు లమ్మే టోకు వ్యాపారులు, డీలర్లు, చిల్లర వర్తకుల సంఖ్యను పరిమితం చేస్తూ ఆ మేరకు మాత్రమే లైసెన్సులివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇప్పుడు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది. ఈ తీర్పు సంఘ్ పరివార్‌కు చెందిన త్రిపుర గవర్నర్ తథా గత రాయ్‌కి ఆగ్రహం కలిగించింది. ‘త్వరలో హిందూ దహన సంస్కారాలు సైతం నిషిద్ధమవుతాయి కాబోలు’ అంటూ ట్వీట్ చేశారు. పైగా ఇలా అనడం ద్వారా రాజ్యాంగ పరిమితులను తానేమీ అతిక్రమించడం లేదని వివరణనిచ్చారు. నిజా నికి సుప్రీంకోర్టు టపాసులు పేల్చడాన్ని నిషేధించలేదు. వాటి అమ్మకాలను మాత్రమే నిషేధించింది. ఇప్పటికే టపాసులు కొనుక్కున్నవారు పండగరోజు వాటిని పేల్చడానికి ఎలాంటి అడ్డంకీ లేదు. ఈసారి ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం కూడా టపాసులపై పాక్షిక నిషేధం పెట్టింది. భారీ శబ్దాలతో పేలే టపాసుల వాడకాన్ని అంగీకరించబోమని చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఢిల్లీతోపాటు ఎన్సీఆర్ పరిధిలో ఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలకు వర్తిస్తాయి. ఢిల్లీ వాసులు టపాసులు కొనుక్కోవాలంటే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, సమయాన్ని వెచ్చించి కనీసం 140 నుంచి 200 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి నేపథ్యముంది. ఢిల్లీ నగరంలో గత ఏడాది దీపావళి రోజున కాలుష్యం తీవ్రత కనీవినీ ఎరుగని రీతిలో ఉంది. సాధా రణ దినాల్లో ఉండే కాలుష్యంతో పోలిస్తే అది ఎంతో అధికం. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు 29 రెట్లు ఎక్కువ. ఒక్క రోజులో ఇంత చేటు కాలుష్యం మరే నగరంలోనూ నమోదు కాలేదని నిపుణులు చెబుతున్నారు. మిగిలిన నగరాల మాటెలా ఉన్నా ఢిల్లీ నగరంలో టపాసులు పేల్చడానికి వ్యతిరే కంగా ఏడెనిమిదేళ్లనుంచి స్వచ్ఛంద సంస్థల ప్రచారోద్యమం సాగుతోంది. ఇంత చేస్తున్నా 2014లో దీపావళినాడు చైనా రాజధాని బీజింగ్‌ను మించి ఢిల్లీలో కాలు ష్యం ఉన్నట్టు బయటపడింది. ఆ మరుసటి ఏడాది అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మన దేశ పర్యటనకొచ్చినప్పుడు ఢిల్లీలో ఆయన బసచేసినచోట అమర్చడానికి అమెరికా రాయబార కార్యాలయం 1,800 ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను కొనుగోలు చేసింది. జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)లో ఆ నగరం 318 పాయింట్ల వద్ద ఉన్నదని కేంద్ర కాలుష్యమండలి నిరుడు ప్రకటించినప్పుడు అందరూ దిగ్భ్రాంతిచెందారు. ఎందుకంటే ఏ ప్రాంతమైనా 300 పాయింట్లు దాటి కాలుష్యాన్ని నమోదుచేస్తే అది ‘రెడ్ జోన్’లో ఉన్నట్టు లెక్క. ఈ టపాసులతో ఢిల్లీకి, మొత్తంగా ఉత్తరాదికి ఒక సమస్య ఉంది. ఇంచుమించు దీపావళి సమయానికి నెమ్మది నెమ్మదిగా మంచు ఆవరించడం మొదలవుతుంది. సరిగా అప్పుడే గాలి మందగమనం ప్రారంభమవుతుంది. కనుకనే టపాసులు, బాణాసంచా కాల్చడం వల్ల వెలువడే పొగ చాలాసేపు ఆ మంచులో నిలకడగా ఉండిపోతుంది. అది మనం పీల్చే గాలితో పాటు శరీరంలోకి ప్రవేశిస్తుంది. పిల్లల్లో ఎంతో ఆసక్తిని కలిగించే పాము బిళ్ల కాలిస్తే వెలువడే పొగ 464 సిగరెట్లను ఒకేసారి తగలెడితే వచ్చే పొగతో సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూచక్రాలు, విష్ణు చక్రాలు వగైరా కూడా దాదాపు దీనికి సమానంగా కాలుష్యాన్ని వెదజల్లుతాయి. ఈ పొగలో నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వంటి అత్యంత ప్రమాదకర సూక్ష్మాణు వులుంటాయి. ఇవి ఆస్త్మా, బ్రాంకైటీస్, కేన్సర్, శ్వాసకోశ వ్యాధి, చర్మవ్యాధులు వగైరాలను కలగజేస్తాయి. వాయు కాలుష్యం వల్ల ఏటా 3,000 అకాల మరణాలు సంభవిస్తున్నాయని పర్యావరణ కాలుష్య నియంత్రణ సంస్థ తెలిపింది. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులు సృష్టించే అయోమయాన్ని కూడా చెప్పు కోవాలి. ఇంచుమించు నెలక్రితం ఒక ధర్మాసనం పరిమితంగా టపాసుల లైసెన్స్ లివ్వొచ్చునని చెప్పింది. ఆ ఉత్తర్వులొచ్చాక వ్యాపారులంతా కోట్లాది రూపాయలు వెచ్చించి సరుకు తెచ్చుకున్నారు. ఈలోగా మళ్లీ నిషేధం అమల్లోకి రావడంతో వారికి ఏం చేయాలో పాలుబోని స్థితి. పండగ సమీపిస్తున్నకొద్దీ టపాసుల ధర పెరుగుతూ పోతుంది కనుక చవగ్గా ఉంటాయని చాలామంది ముందే కొంటారు. అలాంటివారు కాల్చడానికి నిషేధం ఏమీ లేదు. ఎటొచ్చీ ఆలస్యంగా కొనేవారికి మాత్రమే సమస్య. ఢిల్లీలో దీపావళి సమయంలో 50 లక్షల కిలోల టపాసులు కాలుస్తారని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ సరుకంతా ఇప్పుడు విధించిన నిషేధం కారణంగా నల్లబజారులోకి ప్రవేశిస్తుంది. టపాసుల పరిశ్రమపై ఆధార పడి బతుకీడ్చేవారు వేలాదిమంది ఉంటారు. నిషేధం ఉంటుందని చాలా ముందు గానే తెలిపి, దానిపై విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తే... టపాసులు తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం గణనీయంగా తగ్గుతుంది. కార్మికులు సైతం ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటారు. ఆఖరి నిమిషంలో నిషేధానికి బదులు నిర్ణీత సమయానికి మించి టపాసులు పేల్చరాదన్న నిబంధన పెడితే కొంతవరకూ ఫలితం ఉంటుంది. కనీసం వచ్చే ఏడాదైనా చాలా ముందుగా ఇలాంటి నిషేధాలపై ఆలోచన చేసి అందరికీ అవగాహన కలిగిస్తే ఇలాంటి అయోమయ స్థితి ఏర్పడదు. అలాగే ప్రభుత్వాలు కూడా ఆ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి. -
శివకాశి నెత్తిన ఢిల్లీ బాంబు
సాక్షి, చెన్నై: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచాపై విధించిన నిషేధం శివకాశిపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. బాణసంచా విక్రయాల్లో దేశంలోనే అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఢిల్లీలో నిషేధం అమల్లోకి రావడంతో శివకాశి బాణసంచా తయారీదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రూ. 1000 కోట్ల విలువైన సుమారు 50 లక్షల కేజీల బాణసంచా సామగ్రిని గోదాములకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెలుగులు చిమ్మే దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టం. బాణసంచా కాల్చడం మరెంతో ఆనందం. దీపావళిని పురస్కరించుకుని తమిళనాడు విరుదునగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బాణసంచా మార్కెట్లోకి తరలుతుంటాయి. బాణసంచా తయారీకి పెట్టింది పేరుగా , కుట్టి జపాన్‌గా విరుదునగర్ జిల్లాలోని శివకాశి ప్రసిద్ది చెందింది. ఇక్కడ దీపావళిని పురస్కరించుకుని ఏటా రూ.5 వేల కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. కొన్నేళ్లుగా ఇక్కడి ఉత్పత్తిదారులకు షాక్‌ల మీద షాక్‌లు తప్పడం లేదు. ఓ వైపు ప్రమాదాల భయం వెంటాడుతుంటే, మరోవైపు చైనా రూపంలో కష్టాలు తప్పడం లేదు. చాప కింద నీరులా చైనా పటాకులు దిగుమతి అవుతోండటం గగ్గోలు రేపుతోంది. చైనా ఉత్పత్తులను నిషేధించాలని శివకాశి బాణాసంచా తయారీదారులు నినదిస్తూ వస్తున్నారు. అయినా ఫలితం శూన్యం. తాజాగా దీపావళి పర్వదినం సమీపిస్తుండటంతో ఏడాది పొడవునా శ్రమించి ఉత్పత్తి చేసిన బాణసంచాను మార్కెట్లోకి తరలించేందుకు ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. ఆన్లైన్ ద్వారా కూడా బాణసంచా విక్రయాలకు అనేక వర్తక సంస్థలు సిద్ధం అవుతున్నాయి. ఏటా ఏదో ఒక రూపంలో కష్టాలు, నష్టాలు ఎదురు అవుతున్న నేపథ్యంలో ఈసారి కూడా తాము ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందోనన్న ఆందోళన విరుదునగర్ జిల్లా బాణసంచా తయారీదారుల్లో ఉంది. ప్రమాదాలకు ఆస్కారం లేని రీతిలో గట్టి భద్రతా చర్యలు చేపట్టి ఉన్నా, మరో వైపు వర్షం రూపంలో తమ వ్యాపారం దెబ్బ తింటుందేమోనన్న బెంగ పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రూపంలో ఉత్పత్తిదారుల నెత్తిన పిడుగు వచ్చి పడిందని చెప్పవచ్చు. ఢిల్లీ దెబ్బ ...శివకాశికి షాక్ దేశంలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో ముంబై, ఢిల్లీ వంటి నగరాలలో బాణా సంచాల విక్రయాలు అత్యధికంగా సాగుతున్నాయి. శివకాశి నుంచే ఉత్తరాది నగరాలకు బాణా సంచాలను తరలిస్తున్నారు. ఈ సమయంలో ఢిల్లీలో బాణాసంచా అమ్మకంపై నిషేధం అమల్లోకి రావడం శివకాశి ఉత్పత్తిదారుల నెత్తిన పిడుగు పడ్డట్లయింది. వాయు కాలుష్య ప్రభావం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో బాణాసంచాల విక్రయాలపై నిషేధం పడింది. దీంతో శివకాశి నుంచి తరలించాల్సిన బాణా సంచాలు గోడౌన్లకు పరిమితం చేయాల్సిన పరిస్థితి. శివకాశికి చెందిన పరిశ్రమలు ఢిల్లీలో బాణాసంచాల విక్రయాలకు ప్రత్యేక లైసెన్స్‌లను పొంది ఉన్నాయి. ఆ మేరకు 450 వరకు ఓపెన్ టైప్ లైసెన్స్‌లు, వెయ్యి వరకు చిన్న చిన్న దుకాణాల ఏర్పాటుకు తగ్గ లైసెన్స్‌లు కల్గి ఉండగా, ప్రస్తుతం అవన్నీ రద్దు కానుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం విక్రయంలో 20 నుంచి 25 శాతం మేరకు విక్రయాలు ఢిల్లీలో సాగుతాయని, ఈ నిషేధంతో 50 లక్షల కేజీల మేరకు బాణాసంచా గోడౌన్‌కు పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న సరకును బయటకు పంపించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఏమి చేయాలో తోచడం లేదని పరిశ్రమల యజమానులు అంటున్నారు. నిషేధం కారణంగా రూ. వెయ్యి కోట్ల మేరకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం ఇతర ప్రాంతాలకు బాణసంచా రవాణాపై సైతం ప్రభావాన్ని చూపుతుందని, నిషేధం ఉత్తర్వులను సుప్రీంకోర్టు పునర్ పరిశీలించాలని పరిశ్రమల యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
పటాకులపై నిషేధం.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కోల్‌కతా: దేశ రాజధాని ఢిల్లీలో, ఎన్సీఆర్లో బాణాసంచా అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పుబడుతూ త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మొదట ఉట్టి (దహీఅండీ) వేడుకలు, ఇప్పుడు పటాకులు.. రేపు హిందూ దహన సంస్కారాలనూ నిషేధిస్తారేమో.. కొవ్వొత్తులతో నిరసన తెలిపే ఈ అవార్డు వాపసీ గ్యాంగ్ హిందూ దహన సంస్కారాల వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుందని కోర్టులో పిటిషన్ వేస్తుందేమో' అని తథాగత్ రాయ్ ట్వీట్ చేశారు. అతివాద హిందూత్వ భావజాలాలు ఉన్న ఒకప్పటి బీజేపీ సీనియర్ నేత అయిన తథాగత్ రాయ్ ట్వీట్‌పై దుమారం రేగుతోంది. అయితే, దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకాలను నిషేధించడం తనను అసంతృప్తికి గురిచేసిందని, హిందువుల పండుగ చేసుకునే హక్కును ఇది దూరం చేస్తుందనే భావనతోనే ఈ వ్యాఖ్య చేసినట్టు ఆయన మీడియాకు చెప్పారు. తథాగత్ రాయ్ గతంలోనూ పలు అంశాలపై తీవ్ర అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రోహింగ్యాలను 'చెత్త'తో ఆయన పోల్చడం వివాదాస్పదమైంది. -
పటాకుల అమ్మకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో పటాకుల అమ్మకంపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. పటాకుల అమ్మకంపై నవంబర్ 1వ తేదీవరకు నిషేధం అమల్లో ఉండనుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో టాపాసుల అమ్మకంపై నిషేధం విధిస్తూ గత ఏడాది సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్షికంగా ఎత్తివేసిన ఈ ఆదేశాలను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై తన ఉత్తర్వులను ఈ నెల 6న రిజర్వులో ఉంచింది. దేశ రాజధాని ప్రాంతంలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో గత ఏడాది నవంబర్ 11న టపాసుల అమ్మకం లైసెన్సులను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించింది. తాజాగా అర్జున్ గోపాల్ అనే వ్యక్తి ఈ ఆదేశాలను పునరుద్ధరించాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫు న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణ్ వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది దీపావళి సందర్భంగా ఢిల్లీలో వాయుకాలుష్యం బాగా పెరిగిపోయిందని, కాబట్టి ఈ ఏడాది దీపావళి నేపథ్యంలో పటాకుల అమ్మకంపై నిషేధాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఇందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు కూడా మద్దతు తెలిపింది. దీంతో పటాకుల అమ్మకంపై నిషేధ ఉత్తర్వులను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. -
బాణసంచా అమ్మకాలపై బ్యాన్
దేశరాజధాని ప్రాంతమైన ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో బాణసంచా అమ్మకాలపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రాంతంలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం దృష్ట్యా ఈ ఆదేశాలు జారీచేసింది. దీపావళి బాణసంచా పేలుళ్ల వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాలపై మూడు నెలల్లోగా సమాధానం దాఖలు చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది. శుక్రవారం నుంచి తాము తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకు అన్నిరకాల దీపావళి బాణసంచా అమ్మకాలపై నిషేధం విధించాలని, దాన్ని తక్షణం అమలుచేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశరాజధాని పరిసర ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువ అవుతుండటంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకుని, బాణసంచా అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీచేయాలని కోరుతూ పలువురు పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ల విచారణ సందర్భంగానే కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.