సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో సాధారణ రోజుల్లోనే కాలుష్యం ఎక్కువ. ఇక దసరా పండుగ నుంచి దీపావళి పండుగ వరకు నగరాన్ని ఆవహించే కాలుష్యం గురించి చెప్పనక్కరే లేదు. అందుకనే దీపావళి పండుగ సందర్భంగా నగరంలో బాణాసంచా అమ్మకాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. అలాగే ప్రజలు కూడా బాణాసంచా కాల్చకూడదంటూ నిషేధం విధించాలంటూ వచ్చిన విజ్ఞప్తులను త్రోసిపుచ్చింది. ప్రజల ఇష్టాయిష్టాలను తాము నిర్దేశించలేమని, పైగా బాణాసంచాను కాల్చడం తమ సంప్రదాయం, మతాచారం అంటూ వాదించే అవకాశం ఉందని కూడా కోర్టు అభిప్రాయపడింది.
కోర్టు అభిప్రాయం నిజమేనా? దీపావళి పండుగ సందర్భంగా టాపాసులు కాల్చడం భారతీయ హిందూ సంప్రదాయమా? అసలు ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి కొనసాగుతోంది? టపాసులు కాల్చే అలవాటు దీపావళి పండగ నుంచే వచ్చిందా? అంతకుముందు నుంచే ఉందా? అసలు టపాసులు ఎక్కడ పుట్టాయి, దేశానికి ఎప్పుడు వచ్చాయి? రామాయణ కాలం గడిచిపోయిన కొన్ని దశాబ్దాలకు, అంటే క్రీస్తు శకం పదవ శతాబ్దంలోనే టపాసులకు మూల పదార్థమైన ‘గన్ పౌడర్’ను చైనీయులు కనుగొన్నారు. ఆ తర్వాత దాదాపు నాలుగు వందల సంవత్సరాల తర్వాత అవి మనదేశంలోకి ప్రవేశించాయి.
దీపావళి అంటే దీపాల పండుగే
‘దీపావళి పండుగంటే నిజంగా దీపాల పండుగే. భారత దేశంలో దీపావళి పండుగ మొదలైన రోజుల్లో టపాసులు కాల్చే అలవాటు లేదు. దీపావళి వెలిగించడమే ఉండేది. ఆ తర్వాత ఎప్పటికో దీపావళి రోజున టపాసులు కాల్చడం మొదలైంది’ అని బనారస్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, వారణాసిలో ఆలయ పూజారిగా కొనసాగుతున్న విశ్వాంబర నాథ్ మిశ్రా తెలిపారు. ప్రాచీన పుస్తకాల్లో ఉన్న ప్రస్తావనల ప్రకారం టాపాసులు భారత్‌కు క్రీస్తు శకం 1400 సంవత్సరంలో వచ్చాయి. ఇక దీపావళి పండుగ సందర్భంగా వీటిని కాల్చే అలవాటు 1700 సంవత్సరంలో మొదలైంది.
చింతామణిలోనే బాంబుల తయారీ
ఒరిస్సాకు చెందిన గజపతి ప్రతాపరుద్రదేవ రచించిన ‘కౌటుక చింతామణి’ పుస్తకంలో ఈ టపాసులను ఎలా తయారో చేయాలో ప్రస్తావన ఉందని, ఆయన ఆ పుస్తకాన్ని 1497 నుంచి 1939 సంవత్సరాల మధ్య రాసి ఉంటారని ప్రముఖ విద్యావేత్త పీకే గోడే తన ‘ఏ హిస్టరీ ఆప్ ఫైర్ వర్క్స్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో వెల్లడించారు. ఈ హిస్టరీ పుస్తకం 1953లో ప్రచురితమైంది. ‘గంధకం, బొగ్గు, పొటాషియం నైట్రేట్, పాదరసం, ఆవు మూత్రం మిశ్రమాన్ని గుజ్జు తీసిన వెదురు బొంగులో కూరడం ద్వారా టపాసులను తయారు చేయాలి’ అని గజపతి తన పుస్తకంలో పేర్కొన్నారు. అంతకుముందే, అంటే 1421 నుంచి 1472 మధ్య కశ్మీర్‌ను పాలించిన రాజు జైన్ ఉల్ అబిదిన్ 1466లో టపాసులను తయారు చేయించారని ఓ పర్శియన్ గ్రంధం తెలియజేస్తోంది. 1500 దశకంలో గుజరాత్‌కు చెందిన బ్రాహ్మణ కుటుంబాల్లో పెళ్లిళ్లకు బాణాసంచా పేల్చేవారని 1518లో భారత్‌ను సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ద్వార్తే బర్బోసా తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. బాంబులు, రాకెట్లు కాల్చి పెళ్లిళ్లను ఘనంగా జరిపేవారని ఆయన వివరించారు.
1700 సంవత్సరంలోనే....
ఇక పెషావుల కాలంలో, అంటే క్రీస్తు శకం 1700 కాలంలో దీపావళి పండుగ సందర్భంగా టాపాసులను కాల్చే అలవాటు వచ్చిందని, అప్పుడు వాటిని ‘దారుచి లంక’ అని పిలిచేవారని, అంటే బాణాసంచా కలిగిన లంక అని అర్థమని విద్యావేత్త పీకే గోడే తన పుస్తకంలో వెల్లడించారు. పండుగలు, పబ్బాల సందర్భంగా టపాసులు కాల్చడం గత రెండు, మూడు ఏళ్లుగా కాస్త తగ్గినప్పటికీ 40 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈ అలవాటు ఎప్పుడు, ఎలా వచ్చినా ఇప్పుడు టపాసులను కాల్చడం తమ సంప్రదాయం, తమ సంస్కృతని వాదిస్తున్నవాళ్లు, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వాళ్లు ఉన్నారు. వాతావరణంలో కాలుష్యం పెరగడానికి ఒక్క టపాసులే కారణం కాదుకనుక విజ్ఞులైన ప్రజలు భవిష్యత్ తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల కాలుష్యాన్ని నిరోధించేందుకు తమవంతు కృషి చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment