కన్హయ్య నాలుక కోస్తే..అయిదు లక్షలిస్తా..
న్యూఢిల్లీ: ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీ వివాదం కొద్ది కొద్దిగా సద్దుమణుగుతున్న సందర్భంలో బీజీపీ యువజన విభాగం నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జెఎన్యూ యూనివర్శిటీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ నాలుక తెగ్గోస్తే.. అయిదు లక్షలు బహుమతిగా ఇస్తానంటూ కులదీప్ వార్ష్నే వ్యాఖ్యానించి తాజాగా వివాదానికి తెరలేపారు.
భారతీయ జనతా యువమోర్చా బదౌన్ జిల్లా నేత కులదీప్ వార్ష్నే ఈ సంచలన వ్యాఖ్యాలు చేశారు. అఫ్జల్ గురు లాంటి తీవ్రవాదికి మద్దతుగా జాతి వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కన్హయ్య కుమార్ నాలుకను ఎవరైనా కత్తిరించాలని కోరారు. అలా చేసిన వారికి 5 లక్షల రూపాయలను కానుకగా ఇస్తానని చెప్పారు. గురువారం జైలు నుంచి విడుదలైనప్పటినుంచి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, అందుకే ఎవరైనా ఈ చర్యకు పూనుకోవాలన్నారు.
కాగా కన్హయా దేశద్రోహం ఆరోపణలపై ఫిబ్రవరి 12 న అరెస్టు చేయగా, ఢిల్లీ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఈనెల 3న తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం విద్యార్థులనుద్దేశించి రాజద్రోహానికి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు మధ్య తేడాను వివరిస్తూ అతడు ఉత్తేజపూరిత ప్రసంగంతో పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.