కాల్చేస్తే 11 లక్షలు.. నాలుక కోస్తే 5లక్షలు
* ఢిల్లీలో కన్హయ్యపై ‘కాల్చివేత’ పోస్టర్లు.. కేసు నమోదు
* నాలిక కోస్తే ఆఫర్ ఇచ్చిన బీజేపీ నేత
న్యూఢిల్లీ/బదాయూ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ లక్ష్యంగా రివార్డుల ప్రకటనలు వెలువడ్డాయి. ఆయనను కాల్చేస్తే రూ. 11 లక్షలు ఇస్తామని ఢిల్లీలో ‘పూర్వాంచల్ సేన’ పేరుతో శుక్రవారం పోస్టర్లు వెలిశాయి. మరోవైపు.. ఆయన నాలుక కోస్తే రూ. 5 లక్షలు ఇస్తామని యూపీ బీజేపీ నేత ప్రకటించారు. ఢిల్లీ ప్రెస్‌క్లబ్ గోడపై పూర్వాంచల్ సేన పోస్టర్లు అతికిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. కేసు నమోదు చేసి, వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పోస్టర్లో పూర్వాంచల్ సేన అధ్యక్షుడిగా పేర్కొంటూ ఆదర్శ్ శర్మ పేరు, ఫోన్ నంబరు ఉన్నాయి.
కాగా, కన్హయ్య విడుదలయ్యాక బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, అతని నాలుక కోసిన వారికి రివార్డు ఇస్తానని బాదాయూ జిల్లా బీజేపీ యువమోర్చా చీఫ్ కులదీప్ వర్షనయ్ ప్రకటించారు. దీంతో ఆయన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్ల పాటు బీజేపీ అధిష్టానం బహిష్కరించింది.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోనివ్వం: రాహుల్
జేఎన్‌యూలోని 8 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడానికి బీజేపీని అనుమతించబోమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అస్సాం ఎన్నికల సభలో అన్నారు. ‘కన్హయ్య ప్రసంగాన్ని 20 నిమిషాలు విన్నాను. ఒక్క పదమూ దేశానికి వ్యతిరేకంగా లేదు’ అని చెప్పారు.
* కన్హయ్యకు భద్రతలో లోపాలు తలెత్తకుండా వర్సిటీ వెలుపలికి సంబంధించి ఆయన కదలికల వివరాలను తమకు అందించాలని ఢిల్లీ పోలీసులు జేఎన్‌యూ అధికారులను కోరారు.
* విడుదలైన తర్వాత కన్హయ్య ఇచ్చిన ప్రసంగం బావుందని, అది దేశానికి వ్యతిరేకంగా లేదని బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కొనియాడారు.
* రాహుల్ జేఎన్యూకు వెళ్లినందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ అన్నారు.
* రోహిత్ వేముల.. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు మద్దుతుగా సభ నిర్వహించాడని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు.
* భావప్రకటన స్వేచ్ఛపై కన్హయ్య తనతో చర్చలకు రావాలని లూధియానాకు చెందిన జాహ్నవి బెహల్ అనే 15 ఏళ్ల విద్యార్థిని సవాల్ విసిరింది.
ఇక అలహాబాద్ వర్సిటీ వంతు!
అలహాబాద్: తనను వర్సిటీ అధికారులు వేధిస్తున్నారని అలహాబాద్ వర్సిటీ విద్యార్థి నాయకురాలు రిచా సింగ్ ఆరోపించారు. వర్సిటీలో కొందరు అధికారుల నియామకాన్ని తాను వ్యతిరేకించడంతో లక్ష్యంగా చేసుకున్నారన్నారు. వర్సిటీలో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కార్యక్రమాన్ని వ్యతిరేకించినందుకు తనను బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్రపతికి లేఖ రాశారు.