
జైపూర్: పోలీసుల పటిష్ట భద్రత మధ్య పెళ్లికొడుకు ఊరేగింపు చేపట్టిన అరుదైన ఘటన సోమవారం రాజస్థాన్‌లో జరిగింది. బుంది జిల్లాలోని జారా గ్రామానికి చెందిన పరశురామ్ మేఘ్వల్ అనే దళితుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతనికి బరాన్‌కు చెందిన మహిళతో ఫిబ్రవరి 4న వివాహం నిశ్చయమైంది. అయితే సంఘవాడ గ్రామానికి చెందిన ఉన్నత కులాల వ్యక్తులు దళిత వరుడి ఊరేగింపును అడ్డుకుంటారని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. జిల్లా అధికారులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. (కేరళ, పంజాబ్ బాటలో రాజస్తాన్..!)
దీనికి అంగీకరించిన అధికారులు నాలుగు పోలీసు స్టేషన్‌ల నుంచి సుమారు 80 మంది పోలీసు సిబ్బందిని వరుడి ప్రీవెడ్డింగ్ కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసు బలగాల మధ్య వరుడి ఊరేగింపు కార్యక్రమం జరగడం ఆ గ్రామస్తులను విస్మయానికి గురి చేసింది. ఇక భారీగా పోలీసులు మెహరించడంతో సంగీత్ కార్యక్రమాన్ని వరుడి కుటుంబ సభ్యులు మధ్యాహ్నానికి వాయిదా వేసుకున్నారు. అనంతరం ఓ ఆలయంలో వరుడు దేవుని దీవెనలు తీసుకున్నాడు. రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment