
మంత్రుల కోసం విమానాలు ఆపారా?
రిజిజు, ఫడ్నవీస్ కోసం ఎయిరిండియా విమానాలు ఆపినట్టు ఆరోపణలు
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరేన్ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కోసం ఎయిరిండియా విమానాలను నిలిపేసినట్టు ఆరోపణలు రావడం వివాదాస్పదమైంది. మంత్రుల కోసం విమానాలను ఆపేసి ప్రయాణికులను ఇబ్బం దుల పాలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలపై నివేదిక ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) గురువారం పౌర విమానయాన శాఖను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఈ రెండు ఘటనలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని పౌరవిమానయాన శాఖ ఎయిరిండియాను ఆదేశించింది. ఎయిరిండియా నుంచి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని పౌరవిమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే తెలిపారు. జూన్ 24న లేహ్ నుంచి ఢిల్లీకి వచ్చే ఎయిరిండియా విమానంలో రిజిజు ప్రయాణించారు. అయితే రిజిజు, జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్, మరో సహాయకుని కోసం విమానంలో ఉన్న చిన్నారితో పాటు ముగ్గురు ప్రయాణికులను దించేశారని, దీని వల్ల విమానం గంట ఆలస్యమైందని వార్తలు వెలువడ్డాయి.
ఇక జూన్ 29న ముంబై నుంచి అమెరికాకు వెళ్లే ఎయిరిండియా విమానం మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సహాయకుడు కాలంచెల్లిన వీసాను తీసుకురావడంతో అసలు వీసాను తీసుకువచ్చే వరకూ విమానాన్ని నిలిపేశారని మీడియాలో వార్తలొచ్చాయి.
క్షమాపణ చెప్పిన రిజిజు, అశోక్‌గజపతి
తమ వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగడంపై కేంద్రమంత్రి కిరేన్ రిజిజు క్షమాపణ చెప్పారు. అయితే తమ గురించి కొందరు ప్రయాణికులను విమానం నుంచి దించేశారనే విషయం తనకు తెలియదన్నారు. కాగా, ఎయిరిండియా విమానం ఆలస్యం కావడానికి తాను కారణం కాదని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు.