కూతురు ఒత్తిడితో గ్యాంగ్ స్టర్ కు పార్టీ పదవి!
కూతురు ఒత్తిడితో గ్యాంగ్ స్టర్ కు పార్టీ పదవి!
Published Tue, Mar 25 2014 2:48 PM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
రాజకీయాల్లో ఎంత ఉద్దండులైనా ఒక్కోసారి కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలవొగ్గాల్సిందేనని లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి రుజువు చేశారు. తన కూతురు ఒత్తిడి కారణంగా గ్యాంగ్ స్టర్ రిత్ లాల్ యాదవ్ కు పార్టీలో చోటు కల్పించారు. కూతురు మిసా భారతి కారణంగా రిత్ లాల్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్ని కట్టబెట్టారు. బీహార్ లోని పాటలీ పుత్ర లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మిసా భారతి గెలుపు కోసం రిత్ లాల్ కృషి చేయనున్నారు. దాంతో రిత్ లాల్ సేవలకు గుర్తుగా పార్టీ పదవిని కట్టబెట్టేందుకు తండ్రి లాలూపై మిసా పలు అస్త్రాలను ప్రయోగించినట్టు తెలుస్తోంది. పాటలీ పుత్ర నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పట్టున్న రిత్ లాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలువనున్నట్టు చేసిన ప్రకటనతో కంగారు పడిన లాలూకి పార్టీ పదవి కట్టబెట్టక తప్పలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ నేత సత్య నారాయణ్ సిన్హా హత్య కేసులో పాట్నాలోని బేర్ జైలులో రిత్ లాల్ శిక్ష అనుభవిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిత్ లాల్ కు అనుమతి మంజూరైంది. ఈ నియోజకవర్గంలో జేడీ(యూ) అభ్యర్థి రంజన్ ప్రసాద్ యాదవ్, బీజేపీ నుంచి రామ్ కృపాల్ యాదవ్, ఆర్జేడి పార్టీ నుంచి మిసా భారతి బరిలో ఉన్నారు. రిత్ లాల్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే మిసా భారతి అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో పార్టీ పదవిని లాలూ కట్టబెట్టారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా 2015లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రిత్ లాల్ భార్యకు టికెట్ ఇస్తానని లాలూ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement