
సేనకు మళ్లీ చేరువగా బీజేపీ!
- బాల్ ఠాకరే వర్థంతి సందర్భంగా ఆసక్తికర పరిణామాలు
సాక్షి, ముంబై: ఎన్నికలు పెట్టిన చిచ్చు నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేనతో దాదాపుగా తెగదెంపులు చేసుకున్న బీజేపీ మళ్లీ ఆ పార్టీతో చెలిమికి సిద్ధమవుతున్నట్టుగా కన్పిస్తోంది. మరోవైపు వారసత్వ పోరు నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఎడ మొహం, పెడ మొహంగా ఉన్న ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరేలు పక్కపక్కనే ఆశీనులై ఉల్లాసంగా ముచ్చటించుకుంటూ గడిపారు. సోమవారం ఇక్కడ జరిగిన శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాకరే ద్వితీయ వర్థంతి కార్యక్రమం ఈ ఆసక్తికర పరిణామాలకు వేదికైంది.
శివాజీ పార్క్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఠాకరే మెమోరియల్ వద్ద ఎవరో ఒక రాష్ట్ర మంత్రి మాత్రమే నివాళులర్పిస్తారని తొలుత వార్తలొచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆయన వెంటే పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రధానమంత్రి మోదీ కూడా ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తొలి వర్థంతికి హాజరైన అద్వానీ సహా బీజేపీ అగ్రనేతలెవరూ సోమవారం నాటి కార్యక్రమానికి హాజరుకాలేదు. ఫడ్నవిస్ మాత్రం బాల్ ఠాకరేను పొగడ్తలతో ముంచెత్తారు. అందరికీ ఆయన తండ్రిలాంటివారన్నారు. మహారాష్ట్రలో ఆయన వంటి వ్యక్తి మరెవరూ లేరని అన్నారు. బాల్ ఠాకరే హోదాకు తగినస్థాయిలో సార్మక చిహ్నాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఈ మేరకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
బాల్ ఠాకరే స్మృతి చిహ్నం ఏర్పాటుకు శివసేన దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. సేనతో చర్చలకు ద్వారాలు మూసుకుపోలేదని ఫడ్నవిస్ ఆదివారం నాగపూర్‌లో అన్నారు. సేనతో చర్చలు సాధ్యమేనని చెప్పారు. బీజేపీ, సేనల మధ్య సయోధ్యపై అయోమయం కొనసాగుతుండగానే ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్ ఠాకరే చాలాకాలం తర్వాత సోమవారం సోదరుడు ఉద్ధవ్‌తో వేదిక పంచుకున్నారు.
ఈ సందర్భంగా వారి హావభావాలు రెండు సేనల మధ్య సయోధ్యపై ఊహాగానాలకు తెరతీశాయి. ముఖంపై చిరునవ్వుతో వేదికనధిష్టించిన రాజ్.. ఉద్ధవ్, ఆయన చిన్న కుమారుడు తేజాస్, సేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రావత్‌లతో చేతులు కలిపారు.