నేతాజీ రహస్య ఫైళ్ల వెల్లడిలో కీలక మలుపు
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్థానానికి సంబంధించిన రహస్య ఫైళ్లలోని వివరాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా అధికారిక రహస్యాల చట్టాన్ని పునఃసమీక్షంచేందుకు సిద్ధమైంది. ప్రధాని కార్యాలయం, రా, ఐబీ, కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక పరిశీలన బృందాన్ని ఏర్పాటుచేయనున్నట్లు బుధవారం ప్రకటించింది.
నేతాజీ కుటుంబ సభ్యులపై దివంగత ప్రధాని నెహ్రూ నిఘా కొనసాగించారని ఇటీవలే వెలుగులోకి వచ్చిన అంశం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను వెలికితేవాలని పలు సంస్థలు, వ్యక్తులు డిమాండ్ చేస్తుండగా, అవి వెలుగులోకి వస్తే మిత్రదేశాలతో సంబంధాలు చెడిపోతాయని ప్రధానమంత్రి కార్యాలయం సమాధానం ఇస్తూవచ్చింది. ఈ నేపథ్యంలో ఫైళ్ల పరిశీలన సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక ప్యానల్ ఏర్పాటు ప్రధాన్యం సంతరించుకుంది.