నేతాజీ 'రహస్యం' పెద్ద జోకా?
న్యూఢిల్లీ: 'సాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ సుభాష్ చంద్రబోస్ విదేశాల్లో అంతర్థానమయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన రహస్యాలు వెలుగులోకి వస్తే పలు దేశాలతో మనకున్న దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటాయి' అని చిన్నప్పటి నుంచి స్కూల్, కాలేజీల్లో చదువుకున్నాం. నాటి జవహర్ లాల్ ప్రభుత్వం నుంచి నేటి మోదీ సర్కార్ దాకా అందరికి అందరూ ఇదే విషయాన్ని చెబుతూవచ్చారు. కాలం సమీపించడంతో నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బహిర్గతం చేసింది.
అయితే ముందునుంచీ భయపడ్డట్లు దీనిపై ఇటు రష్యాగానీ, అటు జపాన్ గానీ ఒక్కమాటైనా మాట్లాడలేదు. వాళ్లతో భారత్ సంబంధాలు తెగిపోనూలేదు. అంటే ఇన్నాళ్లూ నేతాజీ విషయంలో ప్రభుత్వాలు చెప్పినవన్నీ అబద్ధాలా? నేతాజీ అంతర్థానం, దాని వెనకున్న రహస్యం పెద్ద జోకా?' అంటూ పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీశారు బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపీ బతృహరి మహతాబ్.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాధాలు చెప్పే తీర్మానంలో భాగంగా శుక్రవారం లోక్ సభలో మాట్లాడిన ఎంపీ మహతాబ్.. నేతాజీ అంతర్థానం, రహస్య ఫైళ్ల వెల్లడిలో ప్రభుత్వాలు అనుసరించిన తీరును ఘాటుగా విమర్శించారు. విడతల వారీగా ప్రభుత్వం వెల్లడిస్తోన్న రహస్య ఫైళ్లలో కొత్త విషయాలేవీ లేవని, అందులో ఉన్నదంతా దేశప్రజలకు ఇదివరకే తెలుసునని, గొప్ప యోధుడి విషయంలో ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవపట్టించడం దారుణమని మహతాబ్ అన్నారు.
అటల్ బిహారీ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటుచేసిన ఎం కె ముఖర్జీ కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ.. నేతాజీ అంతర్థానం అయ్యారని భావిస్తున్న ప్రాంతంలో విమాన ప్రమాదమేదీ జరగలేదని ఆ కమిటీ పేర్కొందని, మిగతా ఫైళ్లు మాత్రం ప్రమాదం జరిగిందని నివేదించడం గమనార్హమన్న ఆయన.. ఇప్పటికైనా ఈ విషయంలో అన్ని విషయాలు వెల్లడైనట్టా? లేక ఇంకేవైనా రహస్యాలను ప్రభుత్వం దాచిపెడుతోందా? అని ప్రశ్నించారు.
లోక్ సభలో మాట్లాడుతున్న బీజేడీ ఎంపీ బతృహరి మహతాబ్.