మరణ శిక్ష అమలులో ఆలస్యం చేయడం అనేది అమానవీయ చర్య అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ: మరణ శిక్ష అమలులో ఆలస్యం చేయడం అనేది అమానవీయ చర్య అని, అంతేకాకుండా అది చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మరణ శిక్ష అమలులో జరిగే జాప్యం వల్ల సదరు ఖైదీ మానసిక క్షోభను అనుభవిస్తాడని జస్టిస్ జీఎస్ సిస్తాని, జస్టిస్ వినోద్ గోయల్‌ల ధర్మాసనం పేర్కొంది. 31 ఏళ్ల ఖైదీ సోనూ సర్దార్ తన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
2004లో జరిగిన ఐదుగురి హత్య కేసులో సర్దార్ సింగ్‌కు 2008లో ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ తీర్పును 2010లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సమర్థించింది. దీంతో సర్దార్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2012లో సుప్రీంకోర్టు ఆ రెండు న్యాయస్థానాల తీర్పును సమర్థిస్తూ మరణశిక్షను ఖరారు చేసింది. 2013లో గవర్నర్‌కు, 2014లో రాష్ట్రపతికి క్షమాభిక్షను కోరారు. వారు కూడా అతని పిటిషన్‌ను తోసిపుచ్చారు.
2015లో శిక్షను మరోసారి సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం మళ్లీ నిరాకరించింది. ఇక చివరిసారిగా రాష్ట్రపతి, గవర్నర్ ఉత్తర్వులను కొట్టివేయాలని, అలాగే తన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ ధర్మాసనం మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించింది.