2వ తేదీన ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీ
ఆటోలకు నల్లజెండాలు కట్టుకుని ఆటోవాలాలు దేశ రాజధాని నగరంలో జూన్ రెండో తేదీన నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఆటో డ్రైవర్లలో దాదాపు సగం మంది ఆరోజు నిరసనలో పాల్గొంటారు. జీపీఎస్ లేని ఆటోలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీని నిషేధిస్తూ విధించిన నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ వారీ నిరసన చేయబోతున్నారు. ఐఎస్బీటీ నుంచి సచివాలయం వరకు ఢిల్లీ ఆటోరిక్షా సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతుంది.
కొన్ని రోజులుగా ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు తాము అపాయింట్మెంట్ కోరుతున్నా, ఆయన అంగీకరించలేదని, ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్న్రర్, సీఎస్ కలిసి ఈ నిబంధన ఎత్తేయాలని ఆటో సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సోనీ డిమాండ్ చేశారు. గుర్గావ్లో జీపీఎస్ పరికరాలు మీటర్లతో కలిపి రూ. 3,500కే దొరుకుతుంటే ఇక్కడ మాత్రం రూ. 13-17 వేల వరకు ఖర్చవుతోందని ఆయన చెప్పారు.