నిర్భయ దోషుల్ని 22న ఉరితీస్తారా? | Delhi court stays Jan 22 hanging of convicts over mercy petition | Sakshi
Sakshi News home page

నిర్భయ దోషుల్ని 22న ఉరితీస్తారా?

Published Fri, Jan 17 2020 5:39 AM | Last Updated on Fri, Jan 17 2020 5:39 AM

Delhi court stays Jan 22 hanging of convicts over mercy petition - Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ మూకుమ్మడి అత్యాచారం, హత్య కేసులో దోషులను ఈ నెల 22న ఉరి తీసే అవకాశాలపై సందిగ్ధం నెలకొంది. దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి మూడు రోజుల క్రితమే విజ్ఞప్తి చేశారు. అది పెండింగ్‌లో ఉన్నందున ఉరి అమలును వాయిదా వేయాలంటూ ముఖేష్‌ సింగ్‌ తరఫు లాయర్‌ తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిని విచారించించి కోర్టు, తాము జారీ చేసిన డెత్‌ వారెంట్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. దీంతో లాయర్‌ గురువారం ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ కుమార్‌ అరోరా ఉరి అమలుపై సమగ్ర నివేదికను శుక్రవారానికల్లా సమర్పించాలని ఆదేశించారు.  

వ్యవస్థలకు కేన్సర్‌ సోకింది
నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందు వల్ల ఉరిశిక్ష అమలు కోర్టు ఆదేశించినట్టుగా 22న సాధ్యం కాదని ఢిల్లీ సర్కార్‌ హైకోర్టుకు తెలిపింది.  నిబంధనల ప్రకారం ఒక కేసులో ఉన్న దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాల్సి ఉంటుందని, ముఖేష్‌ క్షమాభిక్ష పెట్టుకోవడంతో మిగిలిన వారి ఉరినీ వాయిదా వేయాల్సి ఉంటుందని తీహార్‌ జైలు అధికారులు కోర్టుకు విన్నవించారు.  దీనిపై హైకోర్టు బెంచ్‌ తీవ్రంగా స్పందించింది. ‘నిబంధనల్ని రూపొందించే సమయంలో ఎవరూ బుర్ర ఉపయోగించలేదా ? ఈ లెక్కన దోషులందరూ క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నంత వరకు వేచి చూస్తారా? దేశంలో వ్యవస్థలకి కేన్సర్‌ సోకింది’అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.

ఎందుకు ఉరి అమలును ఆలస్యం చేస్తున్నారు ? ఎవరు మిమ్మల్ని నియంత్రిస్తున్నారు ? ఒకసారి డెత్‌ వారెంట్లు జారీ అయ్యాక ఉరి అమలులో తాత్సారం జరగకూడదంటూ వ్యాఖ్యానించింది. ఇలాగైతే దేశంలో వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని హైకోర్టు బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఉరి అమలు వాయిదా వేయాలన్న ముఖేష్‌ సింగ్‌ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఢిల్లీ సర్కార్‌ ఆగమేఘాల మీద స్పందించి క్షమాభిక్షను తిరస్కరించాలని నిర్ణయించింది.   కాగా,నిర్భయ దోషుల్ని ఉరి తీయడానికి ఢిల్లీలో ఆప్‌ సర్కార్‌ కావాలనే జాప్యం చేస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. 2017లోనే సుప్రీం కోర్టు వారికి ఉరిశిక్ష ఖరారు చేసినప్పటికీ ఆప్‌ ప్రభుత్వం ఉరి అమలును ఎందుకు నానుస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావేద్‌కర్‌ ప్రశ్నించారు.

వెంటాడుతున్న ప్రాణభయం
నిర్భయ దోషుల్లో ప్రాణభయం రోజు రోజుకీ పెరిగిపోతోంది. దోషుల్లో అతి చిన్నవాడైన 26 ఏళ్ల వయసున్న వినయ్‌ శర్మ అందరికంటే ఎక్కువగా ఆందోళనకు లోనవుతున్నాడు. ఢిల్లీ హైకోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసిన దగ్గర నుంచి దోషులు నలుగురు ముఖేష్‌సింగ్, వినయ్‌ శర్మ, అక్షయ్‌కుమార్‌ రాథోడ్, పవన్‌ గుప్తాలను తీహార్‌ జైలు అధికారులు నాలుగు వేర్వేరు సెల్స్‌లో ఉంచారు. రేయింబగళ్లు వారి కదలికల్ని సీసీటీవీ కెమెరాల ద్వారా గమనిస్తున్నారు. వారి మానసిక స్థితి దెబ్బ తినకుండా ప్రతీ రోజూ వారితో మాట్లాడుతున్నారు. సైక్రియాటిస్టులు కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నారు. వీరిలో వినయ్‌ శర్మ తన సెల్‌లో ఒకేచోట ఉండకుండా అసహనంగా తిరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement