హస్తిన తీర్పు : మోదీ, రాహుల్‌ ట్వీట్‌ | Delhi Election Results 2020 Live Updates in Telugu | Sakshi
Sakshi News home page

హస్తిన తీర్పు : ఆప్‌ 62.. బీజేపీ 8

Published Tue, Feb 11 2020 7:35 AM | Last Updated on Tue, Feb 11 2020 9:44 PM

Delhi Election Results 2020 Live Updates in Telugu - Sakshi

నా ప్రత్యేక అభినందనలు
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలకు మించిన ఫలితాలతో అఖండ విజయాన్ని అందుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై ప్రశంసల జల్లులు కురుస్తునే ఉన్నాయి. ఇప్పటికే ఆంద్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, కేరళ ముఖ్యమంత్రులతో పాటు జాతీయ, స్థానిక నేతలు కేజ్రీవాల్‌ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఫలితాల అనంతరం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి శుభాకంక్షలు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాను’అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆప్‌కు తన ప్రత్యేక అభినందనలు అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. 

ఆప్‌ 62.. బీజేపీ 8
ఎలాంటి గందరగోళం, ఉత్కంఠ లేదు. వార్‌ వన్ సైడ్‌ అయింది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను మించిన ఫలితాలతో ‘సామాన్యుడి’ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాగా, కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూసింది. ఈ సారి కూడా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా.. ఏ తరుణంలోనూ కనీసం ఆధిక్యం కూడా ప్రదర్శించ లేదు. ఇక వరుసగా మూడో సారి ఢిల్లీ సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక 2015లో ఆప్‌ 67 స్థానాల్లో ఆప్‌ జయకేతనం ఎగురవేయగా.. బీజేపీ 3 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక తాజా ఎన్నికల్లో ఆప్‌ ఐదు స్థానాలను చేజార్చుకోగా.. బీజేపీ మరో ఐదు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇంతకుమించి 2015 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల ఫలితాల్లో పెద్దగా తేడా ఏం కనిపించలేదు. 

కేజ్రీవాల్‌ అండ్‌ టీమ్‌కు అభినందనలు
ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అవిశ్రాంతంగా ప్రనిచేసిన కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీని అభివృద్ది చేస్తుందనే నమ్మకంతోనే అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరోసారి పట్టం కట్టారన్నారు. ఇక అసెంబ్లీలో ప్రజా సమస్యలు లెవనెత్తుతూ నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్రను బీజేపీ పోషిస్తుందన్నారు. ఇక ఢిల్లీ అభివృద్దికి కృషి చేస్తుందనే నమ్మకంతో కేజ్రీవాల్‌ అండ్‌ టీమ్‌కు అభినందనలు అంటూ నడ్డా ట్వీట్‌ చేశారు. 

ఇది ఢిల్లీ ప్రజల విజయం
ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి అఖండ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు ఆ పార్టీ కన్వీనర్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్‌ వన్‌ సైడ్‌గా నిలిచిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎం కేజ్రీవాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇది ఢిల్లీ ప్రజలు విజయం. ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. అభివృద్దికే ప్రజలు ఓటేశారు. ఈ విజయం కొత్త రాజకీయాలకు నాంది. ఢిల్లీ తన కుమారుడిని మరోసారి నమ్మింది’అంటూ ఆ ప్రకటనలో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 

కేజ్రీవాల్‌కు అభినందనల వెల్లువ
ఒంటిచేత్తో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొని కనీవినీ ఎరుగని రీతిలో మరోసారి బంపర్‌ విక్టరీ సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను తలదన్ని అఖండ విజయంతో ఆప్‌ దూసుకపోతోంది. ఇప్పటికే 45 స్థానాల్లో ఆప్‌ గెలుపొందగా.. 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కేజ్రీవాల్‌ అండ్‌ టీం సాధించిన ఈ సూపర్బ్‌ విక్టరీపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు.

ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్‌కి, ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి విజయ ఢంకా మోగించిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సైతం కేజ్రీవాల్‌కు శుభాభినందనలు తెలిపారు. 

అసెంబ్లీ రద్దుకు సిఫార్సు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి బంపర్‌ మెజార్టీ రావడం, నేటితో అసెంబ్లీ కాలపరిమితి ముగియడంతో ఢిల్లీ శాసనసభను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ రద్దు చేశారు. త్వరలోనే కేజ్రీవాల్‌ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. 

సింగిల్‌ డిజిట్‌కే బీజేపీ పరిమితం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పట్నుంచి 20కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించిన బీజేపీ మెల్లిమెల్లిగా పట్టువదిలింది. ప్రస్తుతం సింగిల్‌ డిజిట్‌ స్థానాలకే బీజేపీ పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌కు రిక్త హస్తమే మిగిలింది. కనీసం ఒక్క స్థానంలో​ కూడా కనీసం ఒక్కసారైనా ఆధిక్యాన్ని ప్రదర్శించలేదు

డిప్యూటీ సీఎం విజయం
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పట్‌పర్‌ గంజ్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవి నేగిపై దాదాపు 3,571 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ దూసుకెళ్తుంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను మరోసారి కంగుతినిపిస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆప్‌ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. 

న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ విజయం
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. శీలంపూర్‌లో ఆప్‌ అభ్యర్థి అబ్దుల్‌ రెహమాన్‌ విజయం సాధించారు. సంగంవిహార్‌, దేవ్‌లీలో ఆప్‌ అభ్యర్థులు మెహనియా, ప్రకాష్‌లు విజయం సాధించారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా 1288 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ముస్తఫాబాద్‌లో బీజేపీ అభ్యర్థి జగదీష్‌ ప్రధాన్‌ విజయం సాధించారు. కల్కాజీలో ఆప్‌ అభ్యర్థి 2070 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.

కేజ్రీవాల్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ అభినందనలు
ఢిల్లీ ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ట్వీటర్‌ వేదికగా స్పందించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు.‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్‌ కిశోర్‌ ట్వీట్‌ చేశారు. కాగా,ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే.

టాపాసులు కాల్చకండి : కేజ్రీవాల్‌
ఆప్‌ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు. పటాకుల స్థానంలో స్వీట్లు పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీ వాయు కాలుష్యం దృష్ట్యా సీఎం కేజ్రీవాల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆప్‌ పేర్కొంది.

ఐదింతలు పెరిగిన బీజేపీ బలం
దేశ రాజధాని ఢిల్లీ పీటాన్ని మరోసారి సామన్యుడే అధిరోహించనున్నాడు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఆప్‌ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం ఉదయం 11 గంటలకు ఆప్‌ 54 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా, బీజేపీ 16స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం.

ఉచిత విద్యుత్‌తో ఆప్‌కు అనుకూలం: బీజేపీ ఎంపీ
నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారికి బిల్లు ఉండదని కేజ్రీవాల్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల్లో పేదల ఓటింగ్‌పై ప్రభావం చూపిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేష్‌ బిధురి అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ దూకుడు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువ చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 

ఓటమికి బాధ్యత వహిస్తా : మనోజ్‌ తివారీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తానని బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ అన్నారు. ఆప్‌ దూకుడుతో కాషాయ పార్టీ కొద్దిస్ధానాలకే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. 70 స్ధానాలు కలిగిన ఢిల్లీలో ఆప్‌ ప్రస్తుతం 50 స్ధానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 20 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 2015 ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు స్ధానాలు గెలుచుకున్న బీజేపీ పుంజుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరట ఇస్తోంది. 



సంబరాల్లో ఆప్‌..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విస్పష్ట విజయం ఖాయమవడంతో ఆప్‌ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆప్‌ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆరు జిల్లాల్లో ఆప్‌ ఏకపక్షంగా దూసుకుపోతోంది.

సత్తా చాటిన ఆప్‌
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్‌ మొదటి నుంచి లీడ్‌లో కొనసాగుతుతోంది. మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలకుగాను ఆప్‌ 50 స్థానాల్లో, బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌, ద్వారాకా, జనక్‌ పురి, కృష్ణానగర్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ అధిక్యంలో కొనసాగుతున్నారు. 

కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద మనీష్‌ 
అక్షర్‌ ధామ్‌ కౌంటింగ్‌ సెంటర్‌లో ప్రతాప్‌ గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, బీజేపీ అభ్యర్థి రవినేగి పాల్గొన్నారు. 


అక్కడక్కడ మెరుస్తోన్న బీజేపీ 
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఇప్పటికే 54 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. ఇక ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి పరాభవం ఎదురైంది. ఆప్‌కు గట్టి పోటీ ఇవ్వకపోయినా.. అక్కడక్కడ బీజేపీ ముందంజలో ఉంది. రోహిణిలో బీజేపీ అభ్యర్థి విజయేంద్రకుమార్‌ లీడ్‌లో కొనసాగుతున్నారు. బగ్గాలో తాజిందర్‌పాల్‌ సింగ్‌ ఆప్‌ అభ్యర్థిని వెనక్కినెట్టి ముందంజలో కొనసాగుతున్నారు. 

ముందంజలో కేజ్రీవాల్‌, సిసోడియా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఆప్‌ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. 55 స్ధానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉండగా, బీజేపీ 13 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం, ఆప్‌ సీనియర్‌ నేత మనీష్‌ సిసోడియాలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

దూసుకెళ్తున్న ఆప్‌
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 15, కాంగ్రెస్‌ 1 స్థానంలో లీడ్‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని ఆప్‌ నేత,ఢిల్లీ ఉపముఖ్యమంత్రి  మనీష్‌  సిసోడియా అన్నారు.

కౌంటింగ్‌ ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో మొత్తం 21 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గెలుపుపై ధీమాతో ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఆప్‌ మద్దతు దారులు పెద్ద ఎత్తును కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకున్నారు.



పిల్లలతో సహా కేజ్రీవాల్‌ ఇంటికి...
శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతుదారులు ఈ ఉదయం నుంచే ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకుంటున్నారు. పిల్లలతో కలిసి వారంతా కేజ్రీవాల్‌ నివాసానికి వస్తుండటం విశేషం. మరోవైపు బీజేపీ నాయకుడు విజయ్‌ గోయల్‌.. కన్నాట్‌ ప్లేస్‌లోని హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా తన నివాసంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సర్వత్రా ఉత్కంఠ
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ కోసం ఢిల్లీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కే మళ్లీ అధికారం అన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు.. ఎన్నికల సంఘం తుది పోలింగ్‌ శాతాన్ని ఆలస్యంగా వెల్లడించిన నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా ఉండనుందని, ఈసారి కూడా కాంగ్రెస్‌ ఖాతా తెరిచే అవకాశాలు లేవని భావిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47 శాతం పోలింగ్‌ నమోదు కాగా ఈసారి ఐదు శాతం తక్కువగా 62.59 శాతం మాత్రమే నమోదైందని ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.


21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలు

ఓట్ల లెక్కింపులో 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 79 మంది మహిళలు సహా మొత్తం 672 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఢిల్లీలోని సీడబ్ల్యూజీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, సర్‌ సీవీ రామన్‌ ఐటీఐ, రాజీవ్‌ గాంధీ స్టేడియం, మీరాబాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తదితర 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 33 మంది పరిశీలకులను నియమించారు. 13, 780 పోలింగ్‌బూత్‌లలో పోలైన ప్రతి ఓటును ప్రిసైడింగ్‌ అధికారులు పరిశీలిస్తారని సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సందీప్‌ సక్సేనా తెలిపారు. అభివృద్ధినే ఎజెండాగా తీసుకుని ఎన్నికల బరిలో దిగిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ఈసారి కూడా తమదే అధికారమనే ధీమాతో ఉంది. జాతీయతావాదం, సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై తీవ్రంగా ప్రచారం చేసిన బీజేపీ కూడా ఢిల్లీ సీఎం పీఠం తమకే దక్కుతుందని అంచనా వేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement