అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్స్ వెల్లువ | Delhi fire department gets 293 calls on Diwali | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్స్ వెల్లువ

Published Fri, Oct 24 2014 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

Delhi fire department gets 293 calls on Diwali

 సాక్షి, న్యూఢిల్లీ : నగర అగ్నిమాపక శాఖకు దీపావళినాటి రాత్రి  293 కాల్స్ వచ్చాయి. గత ఐదేళ్లలో ఇన్ని కాల్స్ రాలేదని సంబంధిత అధికారులు శుక్రవారం తెలిపారు. దీపావళి రోజు సాయంత్రం మొదలుకుని శుక్రవారం ఉదయం ఏడుగంటల వరకు మొత్తం 293 కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో 55 కాల్స్ బాణాసంచావల్ల జరిగిన అగ్నిప్రమాదాలకు సంబంధించినవన్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య తమకు అత్యధికంగా 37 కాల్స్ వచ్చాయని, రాత్రి 12 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు 73 వచ్చాయన్నారు.
 
 సాధారణంగా దీపావళి రోజు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య ఎక్కువ  కాల్స్ వచ్చేవన్నారు. ఈ సంవత్సరం మాత్రం ఈ సమయంలో తక్కువగా వచ్చాయన్నారు. అగ్నిపమాదాల్లో ఎటువంటి ప్రాణనష్టమూ లేదని, మంటలను ఆర్పే ప్రయత్నంలో తమ విభాగానికి చెందిన ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని మరో అధికారి చెప్పారు. దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లాలో ఓ చిన్న దుకాణంలో చెలరేగిన మంటలను ఆర్పుతుండగా గాయపడినట్లు చెప్పారు. సిలిండర్ పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు.గాయపడిన ఇద్దరు ఉద్యోగులను చికిత్స కోసం సఫ్ధర్ జంగ్ ఆస్పత్రికి తరలించామని, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగైందని ఆయన తెలిపారు.
 
 దీపావళి రోజున డీఎఫ్‌ఎస్‌కు చెందిన మూడు వేల మంది ఉద్యోగుల్లో 1,800 మంది విధుల్లోఉన్నారు. మంటలను ఆర్పడం కోసం 180 వాహనాలను మోహరించారు. సేవల సమన్వయం కోసం 25 నుంచి 30 వాహనాలను వినియోగించారు.కాశ్మీర్ గేట్ వద్ద కారు విడిభాగాలమార్కెట్‌లో  జరిగిన అగ్నిప్రమాదం గురువారం నాటి ప్రమాదాలనంటిలోనూ పెద్దది. ఓ మూడంతస్తుల భవనంలో  చె లరేగిన మంటలను ఆర్పడం కోసం అగ్నిమాపక శాఖసిబ్బంది మూడు గంటలపాటు శ్రమించారు. దీపావళి పూజ అనంతరం యజమానులు దీపాలు ఆరిపోకముందే దుకాణాలు మూసి వెళ్లిపోయారు. అవి పెద్దఎత్తున అంటుకుని మంటలు భవనం కింద అంతస్తు నుంచి మూడో అంతస్తు వరకు వ్యాపించాయి. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement