సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ బారిన పడిన తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో గత రెండు వారాలుగా చికిత్స పొందుతున్న 45 ఏళ్ల రోహిత్ దుత్త అనే కరోనా బాధితుడు ఆస్పత్రి నుంచి ఆదివారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. 14 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న రోహిత్.. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చికిత్స సమయంలోని అనుభవాలను పంచుకున్నారు. యూరప్ నుంచి వచ్చిన తనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా సోకిందని తెలియగానే.. తొలుత కొంత ఆందోళన చెందినట్లు తెలిపారు. అయితే ఢిల్లీ వైద్యులు అందించిన చికిత్సపై తనకు ఎంతో నమ్మకం కలిగిందని, కరోనాను ఎదుర్కొగల శక్తీసామర్థ్యాలు మన దేశంలో ఉన్నాయని పేర్కొన్నారు. కోవిడ్ సోకినా ఎలాంటి అధైర్యాలకు, భయాలకు లోనుకాకుడదని సలహాఇచ్చారు. ( 91 మంది మృతి.. ఆగని ఎన్నికలు)
సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో సదుపాయాలు ఫైవ్ స్టార్ హోటల్‌ను మించేలా ఉన్నాయని రోహిత్ దుత్త తెలిపారు. ‘గత నెల 24న యూరప్ నుంచి ఢిల్లీ చేరుకున్న తరువాత తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడ్డాను. తొలుత రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరా. అప్పటికి ఢిల్లీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే నాలో కరోనా లక్షణాలు కనిపించడంతో అక్కడి వైద్యులు.. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ అని తేలింది. మొదట్లో కొంత భయపడ్డా.. కానీ వైద్యులు ఎంతో భరోసా ఇచ్చారు. సొంత సోదరుడిలా చికిత్స అందించారు. ప్రధాని మోదీతో సహా, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పరిస్థితిని రోజూ సమీక్షించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపట్టింది. వారికి నా కృతజ్ఞతలు’ అని తెలిపారు.
కాగా ఢిల్లీలో ఇప్పటి వరకు 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీరిలో ఓ మహిళ మృతిచెందగా.. ఆదివారం నాటికి పూర్తిగా కోలుకుని ఇద్దరు బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా కేసులు వెలుగుచూస్తున్న సమయంలో మరో 15 రోజుల పాటు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే మంచిదని కోలుకున్న బాధితులు సలహాలు ఇస్తున్నారు. కరోనాతో ఎలాంటి భయాందోళనలకు లోను కావాల్సిన అవసరం లేదని అంటున్నారు. వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచిస్తున్నారు. మరోవైపు దేశంలో ఆదివారం నాటికి మొత్తం 107 కేసులు నమోదైన అయ్యాయి. ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధికంగా 32 కేసులు వెలుగుచూడగా.. తరువాతి స్థానంలో కేరళ, కర్ణాటకలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment