
న్యూఢిల్లీ: రైల్వే లెవెల్ క్రాస్ గేటును తెరవడానికి నిరాకరించాడని గుర్తు తెలియని వ్యక్తులు గేట్‌మన్ చేతులు నరికేసిన ఘటన ఉత్తర ఢిల్లీ ప్రాంతంలోని నరేలాలో చోటు చేసుకుంది. కుందన్‌పాఠక్ (28) అనే వ్యక్తి నరేలా–రత్‌దానా మధ్య 19వ నంబర్ రైల్వే గేట్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను విధులు నిర్వర్తిస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు గేట్ తెరవాల్సిందిగా ఒత్తిడి చేశారు. ఆ సమయంలో మూరి ఎక్స్‌ప్రెస్ వస్తున్నదని పాఠక్ గేట్ తెరిచేందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన ఆ ముష్కరులు పాఠక్‌ను చావబాది చేతులను నరికివేశారు. ఈ దాడిలో పాఠక్ కాళ్లు, మెడకూడా దెబ్బతిన్నాయి. తీవ్ర రక్తస్రావమైన అతడిని ఆస్పత్రికి తరలించారు. పాఠక్ చేతులకు శస్త్రచికిత్స జరుగుతోందని, కోలుకునే వరకు రైల్వే తరఫున అన్నివిధాలా సాయం అందిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment