నర్సరీలో మేనేజ్‌మెంట్ కోటా రద్దు
నర్సరీ అడ్మిషన్లలో 'మేనేజ్‌మెంట్ కోటా'కు ఢిల్లీ మంత్రివర్గం స్వస్తి పలికింది. ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన కుటుంబాల్లో పిల్లలకు ఇచ్చే 25 శాతం కోటా తప్ప.. నర్సరీ అడ్మిషన్లలో మరే కోటా ఉండకూడదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మిగిలిన సీట్లన్నీ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఒకవేళ దీనికి స్కూలు యాజమాన్యాలు అభ్యంతరం చెబితే తాము కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. మేనేజ్‌మెంట్ కోటా అనేది విద్యావ్యవస్థలో అతిపెద్ద స్కాం అని, వాళ్లు దీన్ని ఆపకపోతే గుర్తింపు రద్దుచేయడం లేదా ప్రభుత్వమే వాటిని టేకోవర్ చేయడం తప్పదని హెచ్చరించారు.
చదువును వ్యాపారం చేసేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. పిల్లలకు అడ్మిషన్లు ఎలా ఇస్తున్నారో బహిరంగంగా చెప్పాలని, ఇప్పుడు మాత్రం వాళ్లు అవలంబిస్తున్న విధానాలు చాలా షాకింగ్‌గా ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు. వెబ్‌సైట్లలో వాళ్లు పెట్టిన ప్రమాణాలు చూస్తే తానే షాక్ తిన్నానని చెప్పారు. పొగతాగే తల్లిదండ్రులు, నాన్ వెజ్ తినేవాళ్లు, మద్యం తాగేవాళ్ల పిల్లలకు కొన్ని స్కూళ్లలో ప్రవేశం లేదు. పెయింటింగ్ వేసేవాళ్లు, సంగీతం తెలిసిన వాళ్ల పిల్లలకు అదనపు రిజర్వేషన్ ఉంటుంది. ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయని ఢిల్లీ సీఎం మండిపడ్డారు.