
ఢిల్లీ : రోహిణి జైలులో ఓ క్రిమినల్ ఖైదీకి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. అయితే అతనికి ఎలా సోకిందనే విషయం ఇంకా తెలియలేదు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..ఢిల్లీ రోహిణీ జైలులోని ఖైదికి అనారోగ్యం కారణంగా శస్ర్త చికిత్స చేశారు. ఆ తర్వాత కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షించగా, కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతనికి కరోనా ఎలా సోకిందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
జైలులో ఉన్నప్పుడు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని జైలు అధికారు పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా జైలులోని 20 మంది ఖైదీలు, ఐదుగురు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచారు. ఢిల్లీ సంగం విహార్ నివాసి అయిన కరోనా బాధితుడికి హత్యాయత్నాం, దోపిడి లాంటి మూడు క్రిమినల్ కేసులకు పాల్పడినట్లు అధికారి తెలిపారు. ఇక ముంబై ఆర్థర్ రోడ్ జైలులోని ఖైదీలకు అత్యధికంగా కరోనా సోకిన సంగతి తెలిసిందే. అక్కడ మొత్తం ఖైదీలు, సిబ్బందికి కలిపి 180 కి పైగానే కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా తీహార్ జైలులోనూ కరోనా కేసులు వెలుగుచూశాయి. (ముంబై జైలులో 100 మందికి కరోనా )