
పరీక్షా నెగ్గిన కేజ్రీవాల్
మద్దతిచ్చిన కాంగ్రెస్, జేడీ(యూ) అనుకూలంగా 37 , వ్యతిరేకంగా 32 ఓట్లు
అవినీతిపరులెవరినీ వదలబోం: కేజ్రీవాల్ నిజాయితీపరులంతా ‘ఆమ్ ఆద్మీ’లేనని వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని మైనారిటీ ఆమ్ ఆద్మీ (ఆప్) సర్కారు తొలి అడ్డంకిని అధిగమించింది. గురువారం విశ్వాస పరీక్ష నెగ్గింది. 70 మంది ఎమ్మెల్యేలున్న ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీకి 36 మంది అవసరం కాగా ఆప్‌కు 37 ఓట్లు లభించాయి. 28 మంది ఆప్ ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు (కాంగ్రెస్ సభ్యుడైన ప్రొటెం స్పీకరు మినహా), ఒక జేడీ(యూ) సభ్యుడు, మరో స్వతంత్రుడు కూడా ప్రభుత్వానికి మద్దతిచ్చారు. 31 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, దాని మిత్రపక్షమైన అకాలీదళ్ సభ్యుడు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో విశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రొటెం స్పీకర్ చౌదరీ మతిన్ అహ్మద్ (కాంగ్రెస్) ప్రకటించారు.
అంతకుముందు దాదాపు నాలుగున్నర గంటల చర్చ అనంతరం విద్యా మంత్రి మనీశ్ సిసోడియా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చర్చను ముగిస్తూ కేజ్రీవాల్ 25 నిమిషాల పాటు ప్రసంగించారు. అవినీతిపై పోరాటంలో ఎటు వైపుంటారో తేల్చుకోవాలని ఎమ్మెల్యేలందరికీ పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చేందుకు అవినీతిమయ కాంగ్రెస్‌తో రాజీ పడ్డారని, అందుకే దాని హయాంలో జరిగిన అవకతవకలపై మాట్లాడటం లేదని అంతకుముందు బీజేపీ సభ్యులు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతికి పాల్పడ్డ వారెవరినీ వదిలేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని పునరుద్ఘాటించారు. ఇది బీజేపీకి కూడా వర్తిస్తుందని చెప్పారు. అయితే ఏ పార్టీపైనా తనకు శత్రుత్వ భావన లేదన్నారు. ఎవరికీ మద్దతు ఇవ్వబోం, తీసుకోబోమన్న కేజ్రీవాల్ మాట తప్పారని హర్షవర్ధన్ (బీజేపీ) దుయ్యబట్టారు. ఆప్ సర్కారుకు కాంగ్రెస్ బయటి నుంచి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. జేడీ(యూ) సభ్యుడు షోయబ్ ఇక్బాల్ మాట్లాడుతుండగా బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. ఆగ్రహానికి లోనైన ఇక్బాల్ కోటు విప్పి దూసుకెళ్లబోవడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.
మమ్మల్ని గేలి చేశారు
గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశం వాడి వేడిగా కొనసాగింది. తామిక్కడికి రాజకీయాలు చేసేందుకు రాలేదని, కేవలం సామాన్యుడి వ్యథను చెప్పేందుకే వచ్చామని కేజ్రీవాల్ అన్నారు. ‘‘సామాన్యుడు ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తాడు లెమ్మనుకోవడమే పెద్ద పార్టీల నేతలు చేసిన అతి పెద్ద తప్పిదం. నేతలకు సామాన్యుని గురించి తెలియదు. ఈ దేశంలో సామాన్యుడే నాగ లి దున్నుతాడు. బట్టలు నేస్తాడు. ఇళ్లు కడతాడు. చంద్రుని పైకీ వెళ్తాడు. కానీ దమ్ముంటే పోటీ చేసి చూడండంటూ మమ్మల్ని కొందరు గేలి చేశారు. అందుకే ఎన్నికల బరిలో దిగాం. అలా సామాన్యుడు ఈ రోజు చట్టసభలకు వచ్చాడు. ఒకప్పుడు నేను నాస్తికుణ్ని. కానీ దేవుడున్నాడని ఇప్పుడు గ్రహించాను. సత్యానికి ఓటమి లేదని ఢిల్లీవాసులు నిరూపించారు. అవినీతిమయ రాజకీయాల నుంచి దేశాన్ని విముక్తం చేయడమెలాగో చేతల్లో చూపించారు’’ అని చెప్పారు. ఇది తమ ప్రభుత్వ విజయం కాదని, సామాన్య ప్రజల విజయమని అనంతరం ఆయన విలేకరులతో అన్నారు.
హజారే అభినందనలు
విశ్వాస పరీక్ష నెగ్గినందుకు కేజ్రీవాల్‌ను అవినీతి వ్యతిరేకోద్యమకారుడు అన్నా హజారే అభినందించారు. ఆయన సరైన దిశలో చర్యలు తీసుకుంటున్నారంటూ కొనియాడారు. అయితే ఆప్ సాధించాల్సింది ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. సర్కారుకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరిస్తే ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆప్ ఉత్థానాన్ని సానుకూల పరిణామంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ కూడా అభివర్ణించారు. ఆర్థిక, మతపరమైన అంశాలపై ఆ పార్టీ తన వైఖరి స్పష్టం చేయాలని పార్టీ పత్రిక ‘పీపుల్స్ డెమొక్రసీ’ రాబోయే సంచిక కోసం రాసిన వ్యాసంలో ఆయన కోరారు.
ఆమ్ ఆద్మీకి కొత్త నిర్వచనం
‘ఆమ్ ఆద్మీ’కి కేజ్రీవాల్ కొత్త నిర్వచనమిచ్చారు. ‘రోడ్ల పక్కన, బళ్లపై సామాన్లు అమ్ముకునేవారిని, చాయ్ వాలాలను, కూలీలను ఆమ్ ఆద్మీగా బీజేపీతో పాటు అనేక పార్టీలు పేర్కొంటున్నాయి. కానీ నిజాయితీతో బతికే, నిజాయితీతో కూడిన వ్యవస్థను కోరే ప్రతి వ్యక్తీ సామాన్యుడే. అలాంటి వ్యక్తి గ్రేటర్ కైలా ష్ వంటి సంపన్న కాలనీలో నివసించినా, మురికివాడలో ఉన్నా ఆమ్ ఆద్మీ యే. దీనికి పేద, ధనికుడన్నదానితో సంబంధం లేదు. నిజాయితీపరుడు ఆమ్ ఆద్మీ అయితే అవినీతిపరుడు ఖాస్‌ఆద్మీ (ప్రత్యేక వ్యక్తి)’ అని అసెంబ్లీలో అన్నారు.