
యువత ఇష్టాలలో మార్పు!
యువత ఇష్టాలలో మార్పు రావడంతో జీన్ ఫ్యాంట్లకు రోజులు దగ్గరపడినట్లు అనిపిస్తోంది. గత ఇరవై ఏళ్ళుగా వస్త్ర ప్రపంచంలో జీన్స్ రారాజులుగా వెలుగొందాయి. ప్రస్తుత మార్కెట్‍లో అవి ఖంగుతింటున్నాయి. యువతని, ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్ళను అమితంగా ఆకట్టుకున్న జీన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యాషన్తో పోటీ పడలేకపోతున్నాయి.
కాలేజీలు, పార్టీలు, శుభకార్యాలు...సందర్భం ఏదైనా అబ్బాయిలు, అమ్మాయిలూ అందరూ ధరించేది జీన్స్నే. వారి ప్రధాన ఛాయిస్ జీన్స్గా ఉండేది. గార్మెంట్ రంగంలో రెండు దశాబ్దాలు తిరుగులేని విజయాన్ని చూసిన జీన్ ప్యాంట్లు ఇప్పుడు భారీ పోటీని ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ఓ కొత్త ట్రెండ్ యువతని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఎప్పుడో సినిమాల్లో చూసి బయట ఫ్యాన్స్ ధరించిన అలనాటి కలర్ ఫ్యాంట్ల ఫ్యాషన్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. సాధారణంగా జీన్ ఫ్యాంట్లు బ్లూ,బ్లాక్, బ్రౌన్, షేడెడ్ కలర్లో మాత్రమే ఉంటుంటాయి. అవి వచ్చిన తర్వాత ఇతర రంగురంగుల ఫ్యాంట్లను యువత పట్టించుకోలేదు. యువత దృష్టి మళ్ళీ వాటివైపు మళ్లింది. ఇటీవల కాలంలో కాలేజీ కుర్రాళ్ళకు రంగుల ఫ్యాంట్లపై మోజు పెరిగింది. దాంతో జీన్ ఫ్యాంట్లకు గిరాకీ బాగా తగ్గింది. షోరూమ్స్లో రంగుల ఫ్యాంట్ల అమ్మకాలు పెరిగాయి.
దాంతో వ్యాపారులు, డిజైనర్లు ప్రస్తుత యువత క్రేజీని దృష్టిలో పెట్టుకుని రంగుల ఫ్యాంట్ల తయారీలో తమ క్రియేటివిటీని చూపుతున్నారు. రంగుల ఫ్యాంట్లను స్టైల్గా రూపొందిస్తున్నారు. ఒకే రంగులో పది వెరైటీ డిజైన్లు అందుబాటులోకి తెస్తున్నారు. యువతీ, యువకులు కూడా వీటిని ఎగబడి కొంటున్నారు.
మనవారు 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అంటుంటారు. పురాతన డిజైన్లే కొంత కాలం కనుమరుగై, మళ్లీ అవే కొత్తగా దర్శనమిస్తుంటాయి. పాత ట్రెండ్కే కొత్త హంగులు అద్దుతుంటారు. అవే సంచలనం సృష్టిస్తుంటాయి. యువత వాటినే వేలం వెర్రిగా ఇష్టపడుతుంటారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జీన్ ఫ్యాంట్ల తయారీ కంపెనీలకు గడ్డు కాలమే!
**