
సాక్షి, చెన్నై : తమిళనాడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వ్యంగ్య కార్టూన్ వేసి అరెస్టయిన కార్టూనిస్ట్ బాలక్రిష్ణన్(36)కు ఊరట లభించింది. తిరువనేలి జిల్లా కోర్టు సోమవారం మధ్యాహ్నం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘నేనేం ఘోర హత్యలు చేయలేదు. కాబట్టి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కేసులతో నన్నేం చేయలేరు. ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టడం నేను ఆపను. నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని కోర్టు వెలుపల బాల ప్రకటించారు. తిరునల్వేలి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం సజీవంగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా.. వడ్డీ వ్యాపారుల ఆగడాలను అడ్డుకోవటంలో ప్రభుత్వం, అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపించాయి.
ఈ నేపథ్యంలోనే ప్రముఖ కార్టూనిస్ట్, లయన్స్ మీడియా వెబ్ సైట్ నిర్వాహకుడు అయిన బాల వ్యంగ్య కార్టూన్ వేసి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. కలెక్టర్ ఫిర్యాదుతో ఆదివారం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయగా.. దేశ వ్యాప్తంగా పాత్రికేయులు ఆయనకు మద్దతు ప్రకటించారు.