
నోట్ల రద్దు పెద్ద స్కామ్: కాంగ్రెస్
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు దేశ రాజకీయ చరిత్రలో పెద్ద స్కామ్ అని కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆరోపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 8 వరకు జరిగిన ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఖాతాల లావాదేవీల వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేసింది.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఇటీవల భారీ మొత్తంలో పట్టుబడిన నగదు బీజేపీదేనని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా ఆరోపించారు. ఘజియాబాద్ లో రూ. 3 కోట్లతో దొరికిన ఇద్దరు వ్యక్తులను విడిపించేందుకు బీజేపీ నాయకుడు అశోక్ మోంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారని చెప్పారు. తాను అమిత్ షా తరపున వచ్చానని, పట్టుబడ్డిన డబ్బు బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం నుంచి లక్నో బీజేపీ ఆఫీసుకు చేరాల్సివుందని మోంగా చెప్పినట్టు సూర్జివాలా తెలిపారు.
ఛాయ్ కూడా డిజిటల్ పేమెంట్ ద్వారా కొనుక్కోవాలని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ కార్యాలయానికి పెద్ద మొత్తంలో నగదు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. మీకు నగదు లావాదేవీలు వర్తించవా అని అడిగారు.